వరద బాధితుల గుర్తింపులో వివక్ష
ఒక పక్క వరద ముంపునకు గురై నానా అవస్ధలు పడుతున్న బాధితులకు రాజకీయ పార్టీల నాయకుల వ్యవహారశైలి మరింత ఆగ్రహం తెప్పిస్తోంది.
అ«ధికార పార్టీ నేతల సిఫార్సులతోనే
సరుకుల పంపిణీ
చందవరం (నాదెండ్ల): ఒక పక్క వరద ముంపునకు గురై నానా అవస్ధలు పడుతున్న బాధితులకు రాజకీయ పార్టీల నాయకుల వ్యవహారశైలి మరింత ఆగ్రహం తెప్పిస్తోంది. చందవరం గ్రామంలో భారీ వర్షాలకు రక్షిత మంచినీటి చెరువు తెగి మూడు కాలనీలు నీట మునిగాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలలోని ఇళ్ల లోకి నీరు చేరి నానా అవస్థలు పడ్డారు. గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతో అధికారులు వివరాల నమోదులో వివక్ష చూపారు. మొత్తానికి 62 మందిని లబ్దిదారులుగా తేల్చారు. ఒక్కొక్కరికి ప్రభుత్వం 20 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ పంచదారతో పాటూ నూనె ప్యాకెట్ పంపిణీ చేయాలని ఆదేశించింది. సోమవారం కేవలం 11 మందికి పంపిణీ చేసిన అధికారులు, మిగిలినవి తరువాత పంపిణీ చేస్తామని చెప్పడంతో బా«ధితులు ఆందోళన చెందారు. బాధితుల పేర్లు నమోదు చేయడంలో కూడా అధికార పార్టీ నాయకులు సూచించిన వారి పేర్లనే నమోదు చేసుకున్నారని వాపోయారు. దీనిపై బాధితులు అధికారులను ప్రశ్నిస్తే జాబితా తయారు చేయడం అయిపోయిందని చేతులు దులుపుకొన్నారు.