
పరిటాల సునీత ఫ్లెక్సీలను తొలగించిన 'తమ్ముళ్లు'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి వర్గీయుల మధ్య విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. సునీత, సూరి ఇద్దరూ అధికార టీడీపీకి చెందినవారే అయినా వారి అనుచరుల మధ్య ఫ్లెక్సీల వివాదం ఏర్పడింది.
మంత్రి సునీత అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పక్కనే ఉన్న ధర్మవరం నియోజకవర్గం నుంచి సూరి ఎన్నికయ్యారు. సునీత అనుచరులు ధర్మవరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా, స్థానిక ఎమ్మెల్యే సూరి అనుచరులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం ఏర్పడింది. సూరి అనుచరులు సునీత వర్గీయుల ఫ్లెక్సీలను తొలగించడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరస్పరం దాడి చేసుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అక్కడే ఉన్న పోలీసులు ఈ తతంగాన్ని చూస్తూ ఉండిపోయారు. సూరి వర్గీయులను అరెస్ట్ చేయాలని పరిటాల సునీత అనుచరులు ఆందోళనకు దిగారు.
మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే వరదాపురం సూరి మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మవరంలో పర్యటించిన సందర్భంగా బయటపడ్డాయి. ముఖ్యమంత్రి రాకను స్వాగతిస్తూ ధర్మవరంలో ఎమ్మెల్యే అభిమానులు భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీలలో ఎక్కడా మంత్రి సునీత ఫొటో కన్పించలేదు. జిల్లాకు చెందిన మరో మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఫొటో మాత్రమే కన్పించింది. ధర్మవరం బ్రాంచ్ కెనాల్ అంశంలో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు తెలుస్తోంది.