
సూరితో విభేదాలు లేవు: పరిటాల సునీత
అనంతపురం: అనంతపురం జిల్లా ధర్మవరంలో టీడీపీ కార్యకర్తల మధ్య ఏర్పడిన ఫ్లెక్సీల వివాదంపై మంత్రి పరిటాల సునీత స్పందించారు. ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరితో తనకు ఎలాంటి విభేదాలు లేవని సునీత చెప్పారు.
ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వద్ద పంచాయతీ జరిగిందని వచ్చిన వార్తలు అవాస్తవమని వివరించారు. తాను ఎప్పుడు కబురు చేసినా సూరి వచ్చి మాట్లాడి వెళుతుంటారని సునీత చెప్పారు. ఇటీవల సునీత అనుచరులు ధర్మవరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా, ఎమ్మెల్యే సూరి అనుచరులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం ఏర్పడిన సంగతి తెలిసిందే. సూరి అనుచరులు సునీత వర్గీయుల ఫ్లెక్సీలను తొలగించడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరస్పరం దాడి చేసుకున్నారు. సూరి వర్గీయులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పరిటాల సునీత అనుచరులు ఆందోళనకు దిగారు.