అక్కడ కొన్ని.. ఇక్కడ కొన్ని..
అక్కడ కొన్ని.. ఇక్కడ కొన్ని..
Published Mon, Oct 3 2016 9:58 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
నిజామాబాద్‌అర్బన్ : జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపులో మార్పులు, చేర్పులు కొనసాగుతున్నాయి. ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించి సోమవారం మార్గదర్శకాలు వెలువడ్డాయి. రాష్ట్రస్థాయిలో కొన్ని, జిల్లాస్థాయిలో కొన్ని పోస్టులను విభజించనున్నారు. అటెండర్లు, జూనియర్, సీనియర్ అసిస్టెంట్ల వరకు కలెక్టర్ అధీనంలో, సూపరింటెండెంట్, అసిస్టెంట్ డైరెక్టర్లు, పైస్థాయి అధికారులు, ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో కేటాయింపులు జరగనున్నాయి. కానీ ఏ ప్రాతిపదికన ఏ జిల్లాకు కేటాయిస్తారన్నది మాత్రం స్పష్టం కాకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
ప్రస్తుతం నిజామాబాద్‌లోని జిల్లాస్థాయి కార్యాలయాల్లో 3,370 పోస్టులున్నాయి. ఇందులో 1,100 ఖాళీలు ఉండగా 2,270 మంది పనిచేస్తున్నారు. అటెండర్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు 1,800 మంది ఉండగా.. మిగతా వారు సూపరింటెండెంట్, ఏడీ ఆపైస్థాయి పోస్టులవారున్నారు. దసరాలోపు వీరిని జిల్లాలకు కేటాయించాల్సి ఉంది. జిల్లా ప్రారంభం రోజున మొదట రెవెన్యూ, పోలీసు శాఖలు ఏర్పాటు కానున్నాయి. ఆ తర్వాత ఒక్కో శాఖలో పోస్టులు, అధికారులు సర్దుబాటు చేసి కామారెడ్డికి తరలించనున్నారు. అయితే ఎవరిని ఎక్కడికి పంపిస్తారో తెలియక ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. మరో వైపు వర్క్ టు ఆర్డర్ పేరిట ఉద్యోగులను కామారెడ్డికి కేటాయిస్తారని, ఆ తర్వాత అవసరమైన వారిని రెగ్యులర్ ఆర్డర్ పేరిట పూర్తిస్థాయిలో పంపే ఆలోచన చేస్తున్నారన్న ప్రచారమూ జరుగుతోంది. దసరా సమీపిస్తున్నా.. స్పష్టత రాకపోవడం ఉద్యోగులు అయోమయానికి గురవుతున్నారు.
మరోవైపు ఆయా శాఖలకు సంబంధించి ఫైళ్లను పాత జిల్లాలోనే ఉంచాలని నిర్ణయించారు. ఇలాగైతేనే భద్రత ఉంటుందని భావిస్తున్నారు.
హైదరాబాద్‌లో టీఎన్జీవోస్ నాయకులు
ఉద్యోగుల కేటాయింపుపై స్పష్టత ఇవ్వాలని, ఉద్యోగులకు తగిన న్యాయం చేయాలని టీఎన్జీవోస్ నాయకులు కోరుతున్నారు. ఈ విషయమై సోమవారం హైదరాబాద్ వెళ్లారు. అక్కడ రాష్ట్రస్థాయి అధికారులను కలిసి, ఉద్యోగుల విభజనలో ఇబ్బందులను వివరించనున్నట్లు టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు కిషన్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో అన్ని జిల్లాల టీఎన్జీవోస్ నాయకులతో సమావేశం ఉంటుందని పేర్కొన్నారు.
Advertisement
Advertisement