హాకీ ఇండియా టీమ్ గోల్ కీపర్ రజిని సన్మానిస్తున్న శ్రీపద్మావతి మహిళా యూనివర్శిటీ వీసీ దుర్గాభవాని.
చిత్తూరు జిల్లా ఖ్యాతి విశ్వవాప్తం
Published Wed, Sep 14 2016 11:18 PM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM
చంద్రగిరిః హాకీ క్రీడలో మొదటి మహిళల ఏసియన్ చాంపియన్‌షిప్ ట్రోఫీ సాధించి, ప్రతిష్ఠాత్మమైన రియో ఒలంపిక్స్‌లో హాకీ గోల్ కీపర్‌గా ఉత్తమ ప్రతిభను కనబరిచి చిత్తూరు జిల్లా ఖ్యాతినికి రజనీ విశ్వవ్యాప్తం చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు ఎన్.శివప్రసాద్ కొనియాడారు. ఎర్రావారిపాళ్యం మండలం నెరబైలు గ్రామానికి చెందిన రజనీని బుధవారం చంద్రగిరి ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానంలో సీబార్ స్పోర్ట్స్ కల్చరల్ అకాడమీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. మేళతాళాలతో చంద్రగిరి టవర్‌క్లాక్ వద్ద నుంచి ఊరేగింపుగా పాఠశాల వద్దకు వచ్చారు. అనంతరం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ మారు మూల గ్రామాల్లో ఆదరణ లేక మరుగున పడిన ఇలాంటి రజనీలను ఆదరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం గ్రూప్–2 ఉద్యోగంతో పాటు రూ.25లక్షల నగదు, తిరుపతిలో ఇంటి స్థలాన్ని మంజూరు చేసిందని తెలిపారు.
ఒలంపిక్స్‌లో స్వర్ణమే ధ్యేయం
రజనీ మాట్లాడుతూ తాను ఇంతటి స్థాయికి రావడానికి గురువు వెంకరాజు కారణమైతే, తాను రియోలో ఆడేందుకు అన్ని విధాల కృషి చేసిన వ్యక్తి ప్రసన్న కుమార్‌రెడ్డి అన్నారు. 2005లో హాకీని ఎంచుకున్న తాను పట్టుదలతో కృషి చేశానన్నారు. 2008లో మొట్టమొదటి సారిగా భారత జట్టు తరపున న్యూజిలాండ్‌తో ఆడినట్లు చెప్పారు. రానున్న ఒలంపిక్స్‌లో దేశానికి స్వర్ణ పతకమే లక్ష్యంగా జట్టు తరపున ఆడుతానని తెలిపారు. చంద్రగిరిలో హాకీ అకాడమీను నెలకొల్పి, మరింత మందిని దేశానికి అందించేలా కృషి చేస్తానన్నారు. అనంతరం రజనీని ఎంపీ శివప్రసాద్ ఘనంగా సన్మానించారు. ఎంఈవో ప్రభాకర్ రాజు, ప్రిన్సిపల్ నాగరాజు నాయుడు, మస్తాన్, పాదిరి «దనుంజయ రెడ్డి, జగదీష్ రెడ్డి, మాజీ ఎంపీపీ వేణుగోపాల్ రెడ్డి, గ్రామపెద్దలు పాల్గొన్నారు.
మహిళా వర్శిటీలో ఉద్యోగం
తిరుపతి సెంట్రల్ : రియో ఒలంపిక్స్‌లో దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన హాకీ ఇండియన్ ఉమెన్ టీమ్ గోల్ కీపర్ ఇ.రజిని సేవలు చిరస్మరణీయమని పలువురు కొనియాడారు. రజనిని బుధవారం సాయంత్రం శ్రీపద్మావతి మహిళా యూనివర్శిటీలో వీసీ దుర్గాభవానీ ఆధ్వర్యంలో ఆత్మీయంగా సన్మానించారు. వీసీ మాట్లాడుతూ కృషి, పట్టుదలతో పాటు లక్ష్యసాధన ఉంటే ప్రతి ఒక్కరికీ ఏదో ఒకరోజు జీవితంలో పైకి ఎదిగే అవకాశం వస్తుందన్నారు. అలాంటి జాబితాలో ఓ మారుమూల గ్రామంలో జన్మించి దేశ హాకీ టీమ్ గోల్‌కీపర్‌గా రాణిస్తున్న రజని ఆదర్శనీయం అన్నారు. రజిని ఒప్పుకుంటే తమ యూనివర్శిటీ నుంచి ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. దీనికి స్పందించిన రజిని అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, అవకాశం వచ్చినప్పుడు తన సేవలను మహిళా వర్శిటీకి అందిస్తానని వినయంగా తెలిపారు. అనంతరం రజిని, ఆమె తల్లి దండ్రులు తులసి,రమణాచారితో పాటు గురువు హాకీ ఆంధ్రా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్‌లను వేర్వేరుగా సత్కరించారు. ఈ సందర్భంగా మహిళావర్శిటీ యాజమాన్యం, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాలు సంయుక్తంగా ట్రోఫీలను అందించి, ఆత్మీయంగా సన్మానించారు. రిజిస్ట్రార్ విజయలక్ష్మి, కృష్ణకుమారి, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శారా సరోజిని తదితరులు పాల్గొన్నారు.
Advertisement