దివీస్ కేసుల్లో నేతలకు బెయిల్
తొండంగి:
కోన తీరప్రాంతంలో దివీస్ ల్యాబరేటరీస్ పరిశ్రమ స్థాపనను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న సీపీఐ(ఎంఎల్) లిబరేషన్, సీపీఐ (ఎంఎల్) జనశక్తి పార్టీల నాయకులపై పోలీసులు పెట్టిన కేసుల్లో నలుగురికి మంగళవారం స్టేషన్ బెయిల్ మంజూరైంది. దివీస్ వ్యతిరేకిస్తున్న వారిపై అక్రమ కేసులు ఎత్తివేయడంతో పాటు కాలుష్య పరిశ్రమను రద్దు చేయాలని కోరుతూ సీపీఐ(ఎం.ఎల్.) లిబరేషన్ కేంద్రకమిటీæ సభ్యుడు బుగత బంగార్రాజు, జనశక్తి పార్టీ నాయకుడు కర్నాకుల వీరాంజేనేయులు తదితరుల ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. వీరిని పోలీసులు అరెస్టు చేసి 43 మందిపై ఐపీసీ చట్ట సెక్షన్లు 143, 341, 353, 149 ప్రకారం పలు కేసులు నమోదు చేశారు. కాగా మంగళవారం బుగతా బంగార్రాజు, కర్నాకుల వీరాంజనేయులు, జనార్దన్, మానుకొండ లచ్చబాబులకు స్టేషన్ బెయిల్ మంజూరైంది.
కేసులతో ఉద్యమాన్ని అణచి వేయలేరు
బెయిల్‌పై వచ్చిన అనంతరం బంగార్రాజు, కర్నాకుల వీరాంజనేయులు విలేకరులతో మాట్లాడుతూ కేసులతో ఉద్యమాన్ని అణచి వేయలేరన్నారు. అక్రమ కేసులకు బయపడేదిలేదని, దివీస్‌ను రద్దు చేసే వరకూ లిబరేషన్‌పార్టీలు, ఇతర కార్మిక సంఘాలు, వ్యవసాయకూలీ సంఘాల మద్దతుతో పోరాటం ఉధృతం చేస్తామన్నారు. శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న తమపైనా, బాధిత గ్రామాల ప్రజలపైన అక్రమంగా కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈనెల 19న ఇక్కడ జరుగుతున్న అన్యాయంపై తాము నిర్వహిస్తున్న చలో కలెక్టరేట్‌ను విజయవంతం చేయాలని వారు పిలుపు నిచ్చారు.