నేత్రపర్వం
ఇబ్రహీంపట్నం: దీపావళి వేడుకలు ఇబ్రహీంపట్నం పవిత్రసంగమం వద్ద శనివారం రాత్రి కనుల పండుగగా జరిగాయి. రాష్ట్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, సతీమణి భువనేశ్వరి పాల్గొన్నారు. రాత్రి ఏడు గంటలకు హారతి ముగిసిన అనంతరం నరకాసుర వధ ఘట్టాన్ని నిర్వహించారు. బాణం ఎక్కుపెట్టి వదిలారు. నది ఒడ్డున బాణసంచా పేలుళ్లు నదీజలాల్లో కాంతులీనాయి. విద్యార్థులు వదిలిన ఆకాశ దీపాలు ఆకట్టుకున్నాయి.
ఆకట్టుకున్న నృత్యాలు.. షోలు
దీపావళి వేడుకల్లో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నృత్య కళాకారులు నృత్య ప్రదర్శనులు ఇచ్చారు. రాజమండ్రి కళాకారులు ప్రదర్శించిన నరకాసురవధ కూచిపూడి నృత్యరూపకం ఆద్యంతం ఆకట్టుకుంది. సినీగాయకుడు హేమచంద్ర, హారిక బృందం సభ్యుల గానం తన్మయుల్ని చేసింది. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి తన హాస్యపు జల్లులతో కడుపుబ్బా నవ్వించారు.
తగ్గిన జనసందడి
ఈ కార్యక్రమానికి ప్రచారం కొరవడడమో లేక, శుక్రవారం అమరావతి శంకుస్థాపన అనుభవమో గానీ ప్రజలు పెద్దగా హాజరుకాలేదు. చివరి నిమిషంలో గ్రామానికి ఒక బస్సు ఏర్పాటుచేసి ప్రజలను తరలించేందుకు అధికారులు యత్నించారు. మంత్రి దేవినేని ఉమా, ఎంపీ కేశినేని నాని, కలెక్టర్‌బాబు.ఎ, సీపీ గౌతమ్ సవాంగ్, నటుడు సుధీర్ పాల్గొన్నారు.