పవిత్ర సంగమం..పనులు సందిగ్ధం..
పవిత్ర సంగమం..పనులు సందిగ్ధం..
Published Sun, Jul 17 2016 9:35 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM
పవిత్ర సంగమం వద్ద జరుగుతున్న పుష్కర ఘాట్ల నిర్మాణ పనులు నత్తను తలపిస్తున్నాయి. అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల పనులు ప్రారంభించి రెండు నెలలు అవుతున్నా ఇంకా పూర్తికాలేదనే విమర్శలు వస్తున్నాయి. నేడు (సోమవారం) సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పుష్కరాల నాటికి పనులు ఓ కొలిక్కి వస్తాయో లేదో వేచి చూడాలి.సందిగ్ధం..
ఇబ్రహీంపట్నం :
పవిత్ర సంగమం వద్ద గోదావరి జలాలతో పుణ్యస్నానాలు ఆచరించేందుకు 275 మీటర్ల పొడవున నిర్మించే పుష్కరఘాట్ పనులు ఓ కొలిక్కి రాలేదు. పీపీసీ స్థాయి గ్రౌండ్ లెవెల్ కాంక్రీట్ పనులే జరుగుతున్నాయి. మొదటి దశ పనులే పూర్తికాలేదు. ఆర్‌సీసీ పనులు పూర్తిచేసి
ఆ తర్వాత మెట్లు నిర్మించాలి. టైల్స్ అతికించాలి. ఈ ఘాట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావాలంటే మరో నెలరోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది.
అసంపూర్తిగా కృష్ణా పుష్కర ఘాట్
కృష్ణా జలాలతో పుణ్యస్నానాలు చేసేందుకు కృష్ణానది ఒడ్డున నిర్మిస్తున్న 750 మీటర్ల ఘాట్ నిర్మాణ పనులూ అసంపూర్తిగానే నిలిచాయి. కొంతమేర పీసీసీ, ఆర్‌సీసీ కాంక్రీట్ పనులు నిర్వహించినప్పటికీ ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. నదికి దిగువ వరుసలో ఆర్‌సీసీ పనులు ఇప్పడిప్పుడే ప్రారంభిస్తున్నారు. ఓ భాగంలో మెట్లు నిర్మించే పనులు ప్రారంభించారు. నది దిగువlభాగం నుంచి పైఅంచు వరకూ ఘాట్లను నాలుగు సోపులు, నాలుగు ప్లాట్‌ఫాంలుగా నిర్మించారు. ఒక్కో భాగంలో 8 వరుసల చొప్పున 32 మెట్లను 750 మీటర్ల పొడవున నిర్మించాల్సి ఉంది. అంతే పొడవుతో ప్లాట్‌ఫాంలకు టైల్స్ ఏర్పాటు చేయాలి.
ఆలయాల నిర్మాణ పనులు ప్రారంభం
పుష్కరఘాట్ వద్దకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఎనిమిది పుణ్యక్షేత్రాల నమూనా ఆలయాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇందుకు అవసరైమన మెటీరియల్‌ను ఇప్పటికే తెప్పించారు. కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి, బెజవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం మల్లికార్జునస్వామి, శ్రీకాకుళం శ్రీకూర్మనాభస్వామి, బిక్కవోలు శ్రీసుబ్రహ్మణేశ్వరస్వామి, రామతీర్థం శ్రీరామనాథస్వామి, కదిరి లక్ష్మీనరసింహస్వామి, మచిలీపట్నం శ్రీపాండురంగస్వామి నమూనా ఆలయాలు ఇక్కడ నిర్మిస్తున్నారు.
నేడు సీఎం రాక
పవిత్ర సంగమం వద్ద జరిగే పుష్కర ఘాట్ల నిర్మాణ పనులు పరిశీలించేందుకు సోమవారం సీఎం చంద్రబాబు ఇక్కడకు రానున్నారు. ఈ మేరకు అధికారులు ఘాట్ల వద్ద హడావుడి చేస్తున్నారు. ఘాట్ల పరిశీలన అనంతరం బహిరంగ సభకు సన్నాహాలు జరుగుతున్నాయి. పవిత్ర సంగమం వద్ద కృష్ణానదిలోకి గోదావరి జలాలు వచ్చి చేరినందునే సీఎం పర్యటన ఖరారు అయ్యిందని తెలుస్తోంది. గతంలో రెండుసార్లు పుష్కర ఘాట్లు సందర్శించేందుకు వస్తున్నట్లు ప్రకటించినా రాలేదు. అయినప్పటికీ ఇక్కడ పనులు అసంపూర్తిగానే నిలిచాయి.
Advertisement