రూ.10 నాణాలపై వదంతులు నమ్మొద్దు
నాణాలు తీసుకోకపోతే సమాచారం ఇవ్వండి
పథకాల లబ్ధిదారులకు ప్రోత్సాహం అవసరం కలెక్టర్ ప్రవీణ్‌కుమార్
బీచ్‌రోడ్ (విశాఖ తూర్పు): రూ.10 నాణాలను రద్దు చేసినట్టు వస్తున్న వదంతులు నమ్మొద్దని, ఇందులో వాస్తవం లేదని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. అన్ని రకాల నగదు లావాదేవీల్లోను రూ.10 నాణాలను అనుమతిస్తారని, ఎక్కడైనా అనమతించకపోతే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంకర్లు, అధికారులతో ఆయన సమావేశమై పలు అంశాలపై చర్చించారు. బ్యాంకుల ప్రతినిధులు మాట్లాడుతూ గతంతో పోల్చితే ఆర్బీఐ నుంచి నోట్ల సరఫరా తగ్గిందని, ఇందుకు నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలనేదే ప్రధాన లక్ష్యం కావచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంకుల మధ్య సమన్వయం ఉంటే ఈ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉండదన్నారు. జిల్లాలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే అంశంపై అధికారులతో పాటు బ్యాంకర్లు కూడా కృషి చేయాలని సూచించారు. పింఛన్లు, పౌర సరఫరా, ఉపాధి హామీ తదితర సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఆధార్ సీడింగ్ శత శాతం చేయాలని, ఈ అంశంపై బ్యాంకర్లు కూడా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇప్పటి వరకూ ఆధార్ సీడింగ్ కాని సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాను బ్యాంకర్లకు అందజేయాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
నైట్ షెల్టర్ల నిర్వహణ మెరుగుపరచాలి
నగరంలో ప్రస్తుతం నడుస్తున్న ఆరు నైట్ షెల్టర్ల నిర్వహణను మరింత మెరుగుపరచాలని జీవీఎంసీ అధికారులు, నిర్వహణ సంస్థలను కలెక్టర్ ఆదేశించారు. నిరాదరణకు గురై రోడ్లపై తిరిగే నిరాశ్రయులను గుర్తించి ఆయా కేంద్రాల్లో చేర్చాలన్నారు. కేంద్రాల్లో ఉన్న వారికి ఆధార్, రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు చేయాలని ఆయన ఆదేశించారు. నగరంలో మరో ఎనిమిది నైట్ షెల్టర్ల ఏర్పాటుకు అవకాశం ఉందని, ఇందుకు అవసరమైన ప్రభుత్వ, ప్రైవేటు ఖాళీ భవనాలను గుర్తించాలన్నారు.
ఎకనమిక్ సిటీ ఒప్పందాలను అమల్లోకి తేవాలి
ఈ ఏడాది జనవరిలో జరిగిన భాగస్వామ్య సదస్సులో నగరంలో ఎకనమిక్ సిటీల ఏర్పాటుపై చేసుకున్న ఎనిమిది ఒప్పందాలను సత్వరమే అమల్లోకి తెచ్చేందుకు అధికారులు, బిల్డర్లు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ కోరారు. ఈ అంశంపై కలెక్టర్ సమీక్షిస్తూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సరసమైన గృహాల పథకాన్ని అనుసంధానిస్తూ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరలకే ఇళ్ల నిర్మాణం జరిపేందుకు ఈ ఎకనమిక్ సిటీల ప్రతిపాదన జరిగిందన్నారు. ఈ సమావేశంలో జేసీ–2 డి.వెంకటరెడ్డి, ఎల్‌డీఎం శరత్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.