పనులు వేగం పెంచండి
2019కి మిగులు జలాలు సాధించనున్నారు...
పోలవరాన్ని సందర్శించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ
సాక్షి ప్రతినిధి, ఏలూరు, పోలవరం : ప్రాజెక్టు పనులు 2019 నాటికి పూర్తి చేసేలా వేగం పెంచాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచించింది. కమిటీ చైర్మన్ హుకుంసింగ్ నేతృత్వంలో 9 మంది పార్లమెంట్ సభ్యుల బృందం శుక్రవారం పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులను పరిశీలించింది. తొలుత విజయవాడ నుంచి బయలుదేరిన ఈ బృందం పట్టిసీమ చేరుకుని ప్రాజెక్టును పరిశీలించింది. అనంతరం డెలివరీ పాయింట్‌ను సందర్శించిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు చేరుకుని అక్కడ పోలవరం ప్రాజెక్టు మ్యాప్ చూసి ప్రాజెక్టు నిర్మాణం గురించి తెలుసుకున్నారు. వ్యూ పాయింట్, íస్పిల్‌వే కాంక్రీట్ పనులు, రేడియల్ గేట్ల తయారీ పనులూ వారు పరిశీలించారు. అనంతరం హుకుంసింగ్ మీడియాతో మాట్లాడారు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2019 నాటికి మిగులు జలాలు సాధించే ఘనత దక్కించుకోనుందని హుకుంసింగ్ అన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న జలవనరుల ప్రాజెక్టులను సందర్శిస్తున్న తమ కమిటీ పోలవరం వచ్చిందని పేర్కొన్నారు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా జరిగేలా కృషి చేయాలని సూచించారు. తమ బృందం ఏపీతోపాటు పంజాబ్, చండీఘడ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో క్షేత్ర పరిశీలన చేసి వివిధ జలవనరుల ప్రాజెక్టులను పరిశీలించిందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో దేశంలో నీటికొరత లేకుండా నీటిభద్రత కల్పించే విషయంపై దృష్టి పెట్టేందుకు అవసరమైన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి ఈ కమిటీ అందిస్తుందన్నారు.
తొలుత సీఎంతో భేటి
రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ మాట్లాడుతూ పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులను సందర్శించేందకు వచ్చిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు తొలుత విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారని, ఆయన ప్రాజెక్టు వివరాలను వారికి వివరించారని వెల్లడించారు. విజయవాడ నుంచి పోలపవరం చేరుకున్న ఈ బృందం సభ్యులు పోలవరం ప్రాజెక్టు పనులను కళ్ళారా చూసిన తరువాత సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. దేశంలోనే అత్యుత్తమ ప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుందని చెప్పారు. అనుకున్న ప్రకారం 2019 నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని 2018లో కొంతమేర గ్రావిటీ ద్వారా నీరందించేందుకు యత్నాలు జరుగుతున్నాయన్నారు. జలవనరుల శాఖామంత్రి దేవినేని ఉమమాహేశ్వరరావు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి 97 సార్లు వర్చ్యువల్ ఇన్‌స్పెక్షన్, 18 సార్లు ప్రాజెక్టును సందర్శించారని చెప్పారు. నిర్మాణం విషయంలో ప్రధానమంత్రి మోదీ, కేంద్ర జలవనరుల శాఖామంత్రి ఉమాభారతి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృతనిశ్చయంతో ఉన్నారని ప్రశంసించారు. పోలవరం ప్రాజెక్టు డ్యామ్ పనులు జరుగుతున్న తీరుపై కమిటీ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. ఏలూరు ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పూర్తికి సహకారం అందించాలని స్టాండింగ్ కమిటీ సభ్యులను కోరారు. ప్రతి సోమవారం ముఖ్యమంత్రి పోలవరంపై సమీక్ష నిర్వహించడంతో పాటు ప్రతి నెల 3వ సోమవారం ప్రాజెక్టు పనులను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ పనులను శరవేగం చేస్తున్నారని వివరించారు.
అధికారులతో మాటామంతి
తొలుత పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకున్న కమిటీ సభ్యులకు పోలవరం ప్రాజెక్టు నమూనా పటాన్ని, ఇతర ప్రాజెక్టుకు సంబంధించిన ఛాయాచిత్రాలను చూపిస్తూ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఒనగూరే ప్రయోజనాలను, నిర్మాణ పనుల పురోగతిని జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్, పోలవరం ప్రాజెక్టు సీఈ రమేష్‌బాబులు వివరించారు. ఈ సందర్బంగా కమిటీ సభ్యులు జిల్లా అధికారులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు కోసం జరిగిన భూసేరణపై కలెక్టర్ కాటంనేని భాస్కర్ నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో వి.సత్యభా, అపూరూపకొద్దార్, సర్ధార్ బల్విందర్ ఎస్.గుహంథర్, హర్షవర్ధన్ సింగ్‌దుంగార్‌పూర్, రాపోలు ఆనందభాస్కర్, ప్రదీప్ తమటా, డాక్టర్ సిద్ధాంత్‌మహోపాత్రాలతోపాటు రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పనా శాఖామంత్రి పితాని సత్యనారాయణ, ఎంపీ మాగంటి బాబు, కలెక్టర్ కాటంనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.