డాగ్స్ ప్రేమికులు
♦ డాగ్స్‌ని కన్నబిడ్డల్లా పెంచుతున్న దంపతులు
♦ పుట్టిన రోజు వేడుకులతో సంబురాలు
♦ మరణించిన శునకానికి వర్ధంతి
మొయినాబాద్: వారికి డాగ్స్(శునకాలు) అంటే ఎంతో ఇష్టం... ఎంత ఇష్టమంటే వాటిని కన్నబిడ్డల్లా చూసుకునేలా.. వాటికి పుట్టని రోజు పండుగలు నిర్వహించే విధంగా.. అంతే కాదు చనిపోయిన కుక్కకు వర్ధంతి కూడా చేసేంత ప్రేమవారిది. హైదరాబాద్ నగరానికి చెందిన డాక్టర్ మోహన్, బిజయాదేవి దంపతులు. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు మోహన్ చేవెళ్ల మండలంలోని ఆలూరు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య అధికారిగా పనిచేస్తుండగా బిజయాదేవి మొయినాబాద్ మండల పశువైద్యాధికారిగా పనిచేస్తున్నారు. వీరు మొయినాబాద్‌లోనే సొంత ఇళ్లు నిర్మించుకుని గత రెండు సంవత్సరాల క్రితంనుంచి ఇక్కడే ఉంటున్నారు. వీరికి శునకాలు అంటే చాలా ఇష్టం. గత పది సంవత్సరాలుగా వాటిని పెంచుతున్నారు. వీరికి పిల్లలు లేకపోవడంతో వాటినే కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారు. ప్రస్తుతం వీరి ఇంట్లో నాలుగు శునకాలు వున్నాయి. వాటికి సీజర్, త్రెక్సీ, శాండి, కిట్టు పేర్లు పెట్టారు. వీటిక ప్రతి రోజు పాలు, పెరుగు, బిస్కెట్లు, చికెన్ రైస్ పెడతారు. వారానికోసారి స్నానం చేయిస్తారు. ఇలా వీటికోసం ప్రతి నెల రూ.10 వేల వరకు ఖర్చుపెడుతున్నారు. అయితే వాటిని ఎవరైనా కుక్కలు అని అంటే మాత్రం వారు తట్టుకోలేరు. పేరు పెట్టి పిలవాలని చెబుతారు.
గత నెలలో పుట్టిన రోజు వేడుక
మోహన్, బిజయాదేవిల ఇంట్లో ఉన్న శునకాలకు ప్రతి సంవత్సరం పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తారు. ఇటీవలే జూన్ 2న త్రెక్సీ అనే శునకం పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. కేక్ కట్‌చేసి చుట్టుపక్కల ఉన్న శునకాలన్నింటికి భోజనం పెట్టి విందు ఏర్పాటు చేశారు. అదే విధంగా 2010లో చనిపోయిన శునకానికి ప్రతి సంవత్సరం జూన్ 29న వర్ధంతి నిర్వహిస్తున్నారు. మనుషులు జరుపుకే విధంగానే వాటికి అన్ని వేడుకలు నిర్వహిస్తూ ఈ జంతుప్రేమికులు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇతరులు ఇంటికి రావాలంటే భయం...
మోహన్, బిజయాదేవిల ఇంటికి ఎవరైనా కొత్తగా వెళ్లాలంటే భయపడతారు. మనిషి బయట కనిపించగానే శునకాలు పెద్దగా అరుస్తాయి. దీంతో ఎవరూ అటు వైపు వెళ్లే సహసంకూడా చేయరు. అయితే కొత్తగా మొదటి సారి ఇంటికి వచ్చి వాటిని మచ్చిక చేసుకుంటే మాత్రం తరువాత ఎప్పుడెళ్లినా తమ విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి. వారి ఇంట్లో అద్దెకు ఉండే ముగ్గురు విద్యార్థులు సైతం ఈ శునకాలతో సన్నిహితంగా ఉంటారు.
మా బిడ్డల్లా చూసుకుంటున్నాంః మోహన్, వైద్యాధికారి
నేను చర్లపల్లి జైళ్లో డాక్టర్‌గా పనిచేసే సమయంలో అక్కడ త్రెస్సీ అనే డాగ్ ఉండేది. దాన్ని చాలా ప్రేమగా చూసుకునేవాళ్లం. 2010 జూన్ 29న అది మరణించింది. నా భార్య సొంత బిడ్డను కోల్పోయినంత బాధపడింది. ఆ తరువాత మళ్లీ అలాంటి డాగ్‌నే తీసికొచ్చి పెంచుతున్నాం. ఇలా ఇప్పుడు మొత్తం నాలుగు డాగ్స్‌ని పెంచుతున్నాం. వాటిని మా సొంత బిడ్డల్లా చూసుకుంటున్నాం. అన్ని వేడుకలు, పండుగలు వాటితోనే జరుపుకుంటున్నాం.