ఎమ్మిగనూరులో కుక్కల స్వైర విహారం
Published Sat, Oct 8 2016 1:14 AM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM
– ఒకే రోజు 15 మందిపై దాడి
ఎమ్మిగనూరు రూరల్: ఎమ్మిగనూరు పట్టణంలో కుక్కల స్వైర విహారం చేస్తున్నాయి. పట్టణంలో ఎస్‌ఎంటీ కాలనీ, వీవర్స్ కాలనీ, 11వ వార్డు, 18వ వార్డు, గీతానగర్, సోమప్ప నగర్, మునెప్ప నగర్, శాంతినగర్, ఉప్పర వీధి, గాంధీ నగర్ ప్రాంతాల్లో కుక్కలు కనిపించిన వారిపై దాడి చేస్తున్నాయి. శుక్రవారం ఒక్క రోజు 15 మంది గాయపడ్డారు. ఆయా కాలనీలకు చెందిన సంగీత, రాము, గోపాల్, నందు, విజయ్, దుర్గ, ఫీజ్, అమరేష్, నీలావతి, లక్ష్మీ, పురుషోత్తం, మస్తాన్, రాజేష్, ప్రశాంత్, రాముడు, కోటేకల్ నరసింహులు, కడిమెట్ల విశ్వ కూడా కుక్క కాటుకు గురైనారు. పట్టణంలో కుక్కలు గుంపులు గుంపులుగా ఉంటు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. దసరా సెలవులు కావటంతో చిన్నారులు ఇంటి బయట ఆటలాడుకుంటుండగా కుక్కలు దాడి చేస్తున్నాయి. గాయపడిన బాధితులు చికిత్స కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకుంటున్నారు. వీవర్స్ కాలనీలో ఓ వ్యక్తి దాదాపు పది కుక్కలను ఇంట్లో పెంచుకుంటున్నాడు. ఆ కుక్కల దాడిలో నలుగురు గాయపడినట్లు కాలనీ వాసులు మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ అధికారులు స్పందించకపోతే మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపడుతామని హెచ్చరిస్తున్నారు.
Advertisement
Advertisement