రుణాల పంపిణీలో నిర్లక్ష్యం తగదు
రుణాల పంపిణీలో నిర్లక్ష్యం తగదు
Published Sat, Sep 17 2016 11:25 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
– జిల్లా కలెక్టర్ విజయమోహన్
కర్నూలు(అగ్రికల్చర్): రుణాల పంపిణీలో నిర్లక్ష్యాన్ని సహించబోమని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అన్నారు. శనివారం సాయంత్రం కాన్ఫరెన్స్ హాల్‌లో డీసీసీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్లలో 2015–16 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యం మేరకు రుణాలు పంపిణీ చేయకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఎస్సీ, మైనార్టీ కార్పొరేషన్‌లు ఇంతవరకు లక్ష్యాలు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణాల పంపిణీలో కాపులకు ప్రాధాన్యాత ఇవ్వాలని బ్యాంకర్లను కోరారు. ఖరీఫ్ సీజన్ పంట రుణాల లక్ష్యం రూ,2794 కోట్లు ఉండగా ఇప్పటి వరకు రూ.2300 కోట్లు పంపిణీ చేశారన్నారు. జేడీఏ ఉమామహేశ్వరమ్మ మాట్లాడుతూ....ప్రస్తుతం వరి నాట్లు ముమ్మరంగా పడుతున్నాయని ఈ నెల చివరిలోగా రుణాల పంపిణీలో లక్ష్యాలను అధిగమిస్తామని వివరించారు. మెప్మా ఆద్వర్యంలోని స్వయం సహాయ సంఘాలకు రుణాలు పంపిణీని వేగవంతం చేయాలన్నారు. చిన్న పరిశ్రమల స్థాపనకు బ్యాంకర్లు సహకరించాలని సూచించారు.
డీఆర్‌డీఏ పీడీపై ఆగ్రహం...
డీసీసీ సమావేశానికి డీఆర్‌డీఏ పీడీ రామకృష్ణ హజరుకాకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీడీని సమావేశం నుంచి బయటికి వెళ్లాలని ఆదేశించారు. పీడీ హాజరు కాకపోవడంతో స్వయం సహాయక సంఘాలకు రుణాలు పంపిణీని సమీక్షించలేదు. పట్టు పరిశ్రమ శాఖ డీyీ కూడా సమావేశానికి హాజరుకాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో ఎల్‌డీసీఎం నరసింహారావు, ఆంద్రబ్యాంకు డీజీఎం గోపాలకృష్ణ, ఏపీజీబీ ఆర్‌ఎం విసికే ప్రసాద్, డీసీసీబీ సిఇఓ రామాంజనేయలు, జేడీఏ ఉమామహేశ్వరమ్మ వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు.
Advertisement