
విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు
♦ అధిక ఫీజుల నియంత్రించని ప్రభుత్వం
♦ ఉద్యోగాల భర్తీలో జాప్యం
♦ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర నాయకులు
తాండూరు: విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకోవద్దని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర నాయకులు విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల సమస్యల సాధన కోసం హైదరాబాద్‌లోని గాంధీభవన్ నుంచి గత నెల 27వ తేదీన ఎన్‌ఎస్‌యూఐ చేపట్టిన బస్సు యాత్ర గురువారం ఉదయం తాండూరుకు చేరుకున్నది. పట్టణంలోని విలియంమూన్ చౌరస్తా వద్ద సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేష్‌చారి ఆధ్వర్యంలో యాత్రకు విద్యార్థులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి లారీ పార్కింగ్, ఇందిరాచౌక్‌ల మీదుగా బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ చౌక్ వరకు డప్పు వాయిద్యాలతో ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఎన్‌ఐఎస్‌యూ తెలంగాణ ఇన్‌ఛార్జి ఫిరోజ్ ఖాన్, రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్‌చారిలు మాట్లాడుతూ ఉపకార వేతనాలు, ఫీజు రీఎయింబర్స్‌మెంట్ చెల్లించకుండా కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని విమర్శించారు. అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీని ప్రభుత్వం విస్మరించిందని ధ్వజమెత్తారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థలతో ప్రభుత్వం కుమ్మక్కై అధిక ఫీజులతో దోపిడీ చేస్తున్నా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఎంసెట్ పరీక్షల నిర్వహణలోనూ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. సిమెంట్ కర్మాగారాల్లో స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పీ.మహేందర్‌రెడ్డి చొరవ చూపాలన్నారు. అస్తవ్యవస్త విధానలతో ప్రభుత్వం విద్యారంగాన్ని నాశనం చేస్తుందని నాయకులు ఆరోపించారు. ఊపకార వేతనాలు, ఫీజు రీఎయింబర్స్‌మెంట్‌తోపాటు తదితర విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి అపూ(నయీం), మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్‌లీడర్ సునీత, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు సునీల్, నాయకులు రియాజ్, శివ, క్రాంతి, అశోక్, నరేందర్, శ్యామ్, రఘు, అంకిత్, అనిల్, ప్రవీణ్, గయాజ్,చందు, మధు తదితరులు పాల్గొన్నారు.