ప్రతిపక్షాల గొంతు నొక్కొద్దు : సీపీఎం
విజయవాడ : ఈ నెల 23వ తేదీన జరిగే కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో ప్రజాస్వామ్యయుతంగా చర్చ జరపాలని, ప్రతిపక్షాల గొంతునొక్కే చర్యలను అధికార పక్షం మానుకోవాలని సీపీఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ కోరారు. ఆయన సీపీఎం కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ ప్రజాసమస్యలపై ప్రస్తావిస్తున్న సమయంలో ప్రతిపక్షాల మైక్‌లు నిలుపుదల చేయడం, మాట్లాడే ప్రతిపక్ష నాయకులను నిలువరించే ప్రయత్నం చేయడం, అడ్డుపడటం వంటి చర్యలకు మేయర్ పాల్పడుతున్నారని, అవి తగవని సూచించారు. నగర మేయర్‌గా వ్యవహరించాలే తప్ప, తెలుగుదేశం పార్టీ నేతగా కాదని హితవుపలికారు. నగరంలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారనికి ఈ కౌన్సిల్ సమావేశంలో ప్రజాస్వామ్యయుతంగా చర్చ జరపాలని డిమాండ్ చేశారు.
రాజీవ్‌గాంధీ హోల్‌సేల్ మార్కెట్‌ను, పూల మార్కెట్‌ను తరలించాల్సిన అవసరం లేదన్నారు. అన్ని సౌకర్యాలు ఉన్న ఈ మార్కెట్‌లను తరలించి సింగ్‌నగర్‌లో ఎక్స్‌ల్‌ప్లాంట్ స్థలంలో 4 ఎకరాలు కేటాయించాలనే ప్రతిపాదన విరమించుకోవాలని కోరారు. నగరంలో ప్రబలిన విషజ్వరాలు, మలేరియా, టైఫాయిడ్, డెంగీ వంటి వ్యాధులపై కౌన్సిల్ సమావేశంలొ చర్చించాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో సీపీఎం ఫ్లోర్ లీడర్ గాదె ఆదిలక్ష్మి పాల్గొన్నారు.