జోహన్నెస్‌బర్గ్: అధ్యక్షుడు రాజీనామాకు దారితీసిన గుప్తా స్కాంపై సౌత్ ఆఫ్రికా ప్రతి పక్ష పార్టీ డెమెక్రాటిక్ అలయన్స్(డీఏ) ప్రభుత్వ రంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) పై క్రిమినల్ చర్యలకు సిద్ధపడుతోంది. ఈ మేరకు హిందూ ఒక కథనాన్ని ప్రచురించింది. ది హిందూ, ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ ప్రాజెక్ట్ (ఏసీసీఆర్‌పీ) చేపట్టిన ఒక వివరణాత్మక దర్యాప్తు నేపథ్యంలో ప్రతిపక్షపార్టీ బీవోబీపై చర్యలకు దిగనుందని నివేదించింది.
సీనియర్ బ్యాంకు అధికారులు గుప్తా కుటుంబం యాజమాన్యంలోని కంపెనీలతో సహా, సహారా గ్రూపుకు చెందిన వివిధ కంపెనీలకు దక్షిణ ఆఫ్రికా ప్రభుత్వ సంస్థల నుండి పెద్ద ఎత్తున, వివరణ లేని చెల్లింపులు చేశారనేది ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా జూనియర్ ఉద్యోగులు లేవనెత్తిన అనుమానాస్పద లావాదేవీల నివేదికలను (ఎస్.ఆర్.ఎస్) ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టారని విమర్శించింది. జోహాన్నెస్‌బర్గ్‌లో బీవోబీ బ్రాంచ్‌లో ఈ అక్రమ లావాదేవీలు ఎక్కువగా 2016 లో నమోదైనట్టు గుర్తించింది. ఈ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలని డీఏ భావిస్తోంది. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ చట్టం 29 , 52 సెక్షన్ల ప్రకారం దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది. ఈ భారీకుంభకోణంపై తమ పోరాటం కొనసాగుతుందని డీఏ పార్టీ ప్రతినిధి నటాషా మజ్జోన్ స్పష్టం చేశారు.
1990లలో భారతదేశం నుంచి వలస వెళ్లిన గుప్తా బ్రదర్స్ అతుల్, అజయ్, రాజేష్ - దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా సహకారంతో బిలియన్ డాలర్ల కుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వాన్ని ప్రభావితం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత సంతతికి చెందిన గుప్తా కుటుంబంతో జుమాకు సన్నిహిత్ సంబంధాలు వివాదాస్పదంగా మారాయి. వీటితోపాటు పలు అవినీతి ఆరోపణలు. చివరకు అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఒత్తిడి ఈ ఏడాది ఫిబ్రవరి 14న జుమా రాజీనామాకు దారితీసింది. అదే రోజున, జోహెన్నెస్ బర్గ్‌లోని గుప్తా భవనంపై పోలీసులు దాడి చేయడంతోపాటు అజయ్‌గుప్తాకు అరెస్ట్ వారెంట్ జారీ అయిన సంగతి తెలిసిందే. అలాగేమాజీ ప్రెసిడెంట్ కొడుకు డ్యుడ్యూజనే సహా, ముగ్గురు గుప్తా సోదరులు దుబాయ్‌కి పారిపోయారని భావిస్తున్నారు. మరోవైపు సౌత్ ఆఫ్రికాలో కార్యకలాపాలను నిలిపివేయాలని బీవోబీ నిర్ణయించింది. తమ కార్యకలాపాలు ఎప్పుడూ ఆ దేశంలోని చట్టాలు, నిబంధనలకు అనుగుణంగానే కొనసాగాయని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment