* ప్రజాప్రతినిధి అండతో నోట్ల మార్పిడి దందా
* విజయవాడ కేంద్రంగా సాగుతున్న రాకెట్
* 30శాతం కమీషన్‌పై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నోట్ల మార్పిడి
* పోలీసుల అదుపులో ఓ ముఠా
* కేసు నీరుగార్చేందుకు రాజకీయ ఒత్తిళ్లు !
‘రూ.లక్ష పాత నోట్లకు... రూ.70వేలు కొత్త నోట్లు... మంచి తరుణం మించిన దొరకదు.. వెంటనే రండి... ఎంతైనా మారుస్తాం.. మీకు అనువైన ప్రాంతానికే వస్తాం. ఏదైనా ఇబ్బంది వస్తే అన్న చూసుకుంటారు..’ ఇదీ ప్రస్తుతం విజయవాడ కేంద్రంగా సాగుతున్న నోట్ల మార్పిడి దందా. పెద్ద నోట్ల రద్దును అవకాశంగా తీసుకుని విజయవాడలోని టీడీపీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి అనుచరులు భారీ దందాకు తెరతీశారు. ఆ ప్రజాప్రతినిధి ఒత్తిడితో కొందరు బ్యాంకు అధికారులు వీరికి సహకరిస్తున్నారు. దీంతో బ్యాంకుల నుంచి దొడ్డిదారిలో భారీగా నోట్లు మార్పిడి చేసుకున్నారు. అనంతరం ఐదు ముఠాలుగా ఏర్పడి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నోట్లమార్పిడికి తెరతీశారు. కోట్లలో నోట్లు మారుస్తూ భారీగా కమీషన్లు జేబులో వేసుకుంటున్నారు.
సాక్షి, అమరావతిబ్యూరో: విజయవాడ నగరంలో వివాదాస్పదుడిగా గుర్తింపు పొందిన ఓ ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరులు ఐదుగురు సర్వం తామై నోట్ల మార్పిడి దందాను సాగిస్తున్నారు. ఏపీ, తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో ఉన్న బడాబాబులు, వ్యాపారులతో మంతనాలు సాగిస్తున్నారు. 30 శాతం కమీషన్‌ఇస్తే... పెద్ద నోట్లను మార్పిడి చేసి కొత్త రూ.2వేల నోట్లు ఇస్తామని చెబుతున్నారు. ప్రధానంగా మద్యం, ఇసుక, వడ్డీ, బంగారం, రియల్ ఎస్టేట్ వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని యథేచ్ఛగా కరెన్సీ దందా సాగిస్తున్నారు.
అన్ని కొత్త నోట్లు ఎలా వచ్చాయంటే..
టీడీపీ ప్రజాప్రతినిధి పరపతిని ఉపయోగించి బ్యాంకుల నుంచి కొత్త నోట్లను దొడ్డిదారిలో మార్పిడి చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అమరావతి పరిధిలో కొందరు బ్యాంకు ఉన్నతాధికారులు దొడ్డిదారిలో భారీగా పెద్ద నోట్లు మార్పిడి చేసినట్లు ఇప్పటికే రిజర్వు బ్యాంకు గుర్తించింది. రాష్ట్రంలోనే అత్యధికంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వారం రోజుల్లోనే రూ.9,650 కోట్లు మార్పిడి చేయడం గమనార్హం. కొందరు బ్యాంకర్లు అడ్డదారిలో బడాబాబులకు నోట్లు మార్పిడి చేయడం వల్లే ఇది సాధ్యమైందని ఆర్‌బీఐ ప్రాథమికంగా గుర్తించింది. విజయవాడలోని టీడీపీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి సన్నిహితులతో కూడిన రాకెట్‌కే అడ్డదారిలో భారీగా నోట్లు మార్పిడి చేసినట్లు పోలీసువర్గాలు భావిస్తున్నాయి.
పోలీసుల అదుపులో ఓ ముఠా !
నోట్ల మార్పిడి దందాపై సమాచారం అందడంలో పోలీసులు నిఘా పెట్టారు. నగరంలోని ఓ ప్రాంతంలో నోట్ల మార్పిడి కోసం నిరీక్షిస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. వారిలో టీడీపీ ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరుడు కూడా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ ఐదుగురిని విచారించడం ద్వారా మొత్తం రాకెట్‌ను ఛేదించాలని పోలీసులు భావిస్తున్నారు.
పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు !
నోట్ల మార్పిడి ముఠాను అదుపులోకి తీసుకున్నారని తెలిసిన వెంటనే సదరు టీడీపీ ప్రజాప్రతినిధి రంగంలోకి దిగారు. తన ముఖ్య అనుచరుడిని విడిచిపెట్టాలని... మిగిలిన వారిపై కూడా నామమాత్రంగా కేసు నమోదు చేయాలని ఆయన ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.
నగదు మార్పిడి ఇలా..
-
సెల్‌ఫోన్ల ద్వారా తమ పని సాగిస్తున్నారు.
-
ఏ రోజుకు ఆ రోజు దిన పత్రికపై తేదీ కనిపించేలా కొత్త రూ.2వేల నోట్ల కట్టలను ఉంచి ఫొటో తీసి వాట్సాప్ ద్వారా పంపుతారు.
-
తద్వారా అవి కొత్త నోట్లు అని నిర్ధారణ అవుతుంది.
-
అనంతరం 30శాతం కమీషన్‌పై ఓ చోటకు చేరుకుని నోట్లు మార్పిడి చేస్తున్నారు.
-
ఇలా విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ ప్రాంతాలకు చెందిన నల్లకుబేరులు భారీగా నోట్లు మార్చుకున్నారు.
మంత్రులదీ అదేదారి!
నోట్ల మార్పిడిలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ఇద్దరు మంత్రులు కూడా తమ అనుచరులకు సాయం చేస్తున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన ఓ మంత్రి లిక్కర్ సిండికేట్లతో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని అనుచరులు నోట్లు మార్చుకుని కోట్ల రూపాయలు వెనకేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. మంత్రి అండ ఉండటంతో ఆయన అనుచరులను కొందరు రియల్టర్లు, లిక్కర్ వ్యాపారులు సంప్రదించి గుట్టు చప్పుడుకాకుండా పెద్దనోట్లకుకమీషన్‌పై మార్చుకుంటున్నారు.
గుంటూరు జిల్లాలోనూ....
గుంటూరు జిల్లాకు చెందిన ఒక మంత్రి రైతులకు రుణాలుగా ఇవ్వాల్సిన కొత్తనోట్లను తన అనుచరులకు ఇప్పించినట్లు సమాచారం. జిల్లాకు చెందిన ఒక సీనియర్ ప్రజాప్రతినిధి తన పరిధిలో ఉన్న పాల కేంద్రాల్లో పాత నోట్లు తీసుకోకుండా కట్టడి చేస్తూ... కౌంటర్లలో వచ్చే కొత్తనోట్లను తమ ఖాతాలో వేయించుకుని, తమ వద్ద ఉన్న పాత నోట్లను బ్యాంకులకు జమ చేయిస్తున్నారని సమాచారం. ఒక సీనియర్ ప్రజాప్రతినిధి కుమారుడు కూడా ప్రస్తుతం ఇదే పనిలో బిజీబిజీగా ఉన్న ట్లు తెలిసింది. ఇప్పటికే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ యువరత్నం వివిధ వ్యాపార రంగాలకు చెందిన నల్లకుబేరులను కలిసి ఎన్ని కోట్ల రూపాయలైనా మార్చేస్తామని, 20 శాతం కమీషన్ ఇవ్వాలని చెబుతున్నట్లు సమాచారం.