ఎండు చేపకు జీఎస్‌టీ పోటు | Dried fish GST tide | Sakshi
Sakshi News home page

ఎండు చేపకు జీఎస్‌టీ పోటు

Published Thu, Jul 27 2017 1:47 AM | Last Updated on Tue, Sep 5 2017 4:56 PM

Dried fish GST tide

► కుళ్లిపోతున్న ఎండు చేపలు
►  లక్షల్లో నష్టపోతున్న వ్యాపారులు
► వెనక్కి వస్తున్న ఎండుచేపల లోడ్లు
► విశాఖ హార్బర్లో పేరుకుపోయిన నిల్వలు


పాతపోస్టాఫీసు : కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న జీఎస్‌టీ (వస్తు సేవల పన్ను) ఎండు చేపల వ్యాపారాన్ని సంక్షోభంలోకి నెట్టింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వం విధించిన 12 శాతం పన్ను ఎండుచేపల వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అంతంత మాత్రంగా ఉండే మత్స్యపరిశ్రమను ఆదుకోవాల్సిన ప్రభుత్వం కొత్తగా పన్ను విధించడంతో పరిశ్రమ మరింత లోతుగా కష్టాల్లో కూరుకుపోతోంది. మత్స్యకారులు వేట సమయంలో ఉపయోగించే వివిధ రకాల వస్తువులతోపాటు, రొయ్య, పచ్చి, ఎండు చేపల ఎగుమతిపై విధించిన పన్ను తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది.

ముందుకురాని వ్యాపారులు
ఎండు చేపల కొనుగోళ్లకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో వ్యాపారులు దిగాలుగా కూర్చుంటున్నారు. ప్రతి రోజు చేపల రేవుకు వచ్చి ఎండు చేపలను గుత్తగా కొని ఇతర ప్రాంతాలకు పంపే వ్యాపారులు రావడం మానేశారు. దీంతో ఉన్న సరకును ఏం చేయాలో తెలియక మత్స్యకార మహిళలు దిగాలు పడిపోతున్నారు.

ఎగుమతులు : విశాఖ చేపల రేవు నుంచి కేరళ, వెస్ట్‌ బెంగాల్, బీహార్, చెన్నై, ఒడిశా, కర్నాటక వంటి రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలోని ఏలూరు, విజయవాడ, తాడేపల్లిగూడెం, నెల్లూరు, తిరుపతి, ప్రాంతీయంగా నక్కపల్లి, చందోలు, మానాపురం, కొత్తవలస, పూసపాటిరేగల్లో జరిగే పెద్దసంతలకు సరుకును ఎగుమతి చేస్తుంటారు. ప్రస్తుతం ఈ ప్రాం తాలకు సరుకుతో Ððవెళ్తున్న వ్యాన్‌లు అక్కడ కొనుగోలు చేయకపోవడంతో తిరిగి సరుకుతో చేపల రేవుకు వచ్చేస్తున్నాయి.

బోటు డ్రైవర్లు, కలాసీలతో తగాదాలు
చేపల రేవులో ఉన్న సుమారు 700 బోట్లు నిత్యం వేటకు వెళ్లి వస్తుంటాయి. వేటలో పడే పెద్ద చేపలు, ఎగుమతి ర కం రొయ్యలు బోటు యజమానికి పోగా.. గొరసలు, కానాగడతలు, పట్టిసావళ్లు, గుండరొయ్య, కవ్వళ్లు, గులివిందలు, నెత్తళ్లు వంటి చిన్నచేపలను బోటులో పనిచేసే కలాసీలు, డ్రైవరు అమ్ముకుంటారు. వీటిలో కొంత శాతం బోటులోనే ఎండబెట్టి రేవుకు వచ్చిన తరువాత ఎండుచేపల వర్తకులకు అమ్మేస్తారు. ప్రస్తుతం మంచి ధర పలకడం లేదు. ఎండుచేపలు అమ్మే వర్తకులే సిండికేట్‌ అయ్యి ధరను తగ్గించేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎండుచేపల వర్తకులతో తగాదా పడుతున్నారు. జీఎస్‌టీ బాదుడని వివరించినా బోటు కలాసీలు వినడం లేదని ఎండుచేపల వర్తకులు వాపోతున్నారు.

పేరుకుపోతున్న నిల్వలు
ఎగుమతి అవుతున్న ఒక్కొక్క ఎండు చేపల లారీకి సుమారుగా రూ.25 వేల వరకు జీఎస్‌టీ చెల్లించాలని వ్యాపారులు చెబుతుండడంతో సరుకు వెనక్కి వచ్చేస్తోంది. దీంతో విశాఖపట్నం చేపల రేవులో ఎండుచేపలు టన్నుల కొద్దీ గుట్టలుగా పేరుకుపోతున్నాయి. రూ. లక్షల విలువ చేసే సరుకు కుళ్లిపోతోంది. మత్స్యకార వ్యాపారులు కన్నీళ్లు దిగమింగుకుంటూ వీటిని తిరిగి సముద్రంలో పారబోస్తున్నారు.

ఇరవై రోజులుగా వ్యాపారం లేదు
20 రోజులుగా ఎండు చేపల వ్యాపారం సాగకపోవడంతో ఎండు చేపల బస్తాలను టార్పాలిన్‌తో మూసివేశారు. పగలు, రాత్రి అని తేడా లేకుండా రేవులోనే ఉండిపోయి సరుకును రక్షించుకోవడంతో పాటు కొనుగోళ్లు జరుగాతాయన్న ఆశతో వీరంతా ఎదురు చూస్తున్నారు.

అమ్మకాలు నిలిచిపోయాయి
గత ఇరవై రోజులుగా ఎండు చేపల అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. లక్షలాది రూపాయలు పెట్టుబడిగా పెట్టి తయారుచేసిన సరుకును ఏం చేసుకోవాలో తెలియడం లేదు. ప్రభుత్వం పెద్ద మనసుతో చేపల వర్తకులను జీఎస్‌టీ నుంచి తొలగించాలి
 - చింతపల్లి కొర్లమ్మ, చింతపల్లి, విజయనగరం జిల్లా

సరుకు కుళ్లి పోతోంది
గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండు చేపల మీద పన్ను వేయడంతో కొనుగోళ్లు పడిపోయాయి. దీంతో సరకు కుళ్లి పోతోంది. లక్షల విలువ చేసే సరుకును తిరిగి సముద్రంలో పారబోయడం చాలా బాధగా ఉంది. అధికారులు ఆదుకోవాలి
- బర్రి పెంటమ్మ, చింతపల్లి, విజయనగరం జిల్లా

బోటు సిబ్బందితో గొడవలు
జీఎస్‌టీ వల్ల సరుకు కొనుగోలు కాకపోవడంతో మేము కూడా బోట్లలోని సరకును తక్కువ ధరకే అడుగుతున్నాం. దీంతో ఎండు చేపల వ్యాపారం చేసేవారంతా కలిసిపోయి చేపల ధర తగ్గించేస్తున్నామని మాతో గొడవకు దిగుతున్నారు. ప్రభుత్వం చేసిన పనికి మేము బాధ్యులం ఎలా అవుతాం –బొడ్డు పెద్ద ఎల్లయ్యమ్మ, నాగమయ్యపాలెం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement