కంటైనర్ డ్రైవర్ సజీవ దహనం
కంచికచర్ల :
కంచికచర్ల శివారు 65వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి రోడ్డు పక్కన ఆగివున్న టిప్పర్‌ను మద్యం లోడుతో వెళ్లుతున్న కంటైనర్ లారీ ఢీకొనటంతో డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. మృతుడు రాజస్థాన్‌కు చెందిన డ్రైవర్ రవీంద్రసింగ్ కుస్వాహ్(40)గా గుర్తించారు.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నుంచి సామర్లకోటకు కంటైనర్ లారీ మద్యం లోడుతో వెళ్తోంది. కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ యార్డు దాటి నక్కలంపేట రోడ్డు వద్ద కు రాగానే ఆగిఉన్న టిప్పర్‌ను ఢీకొట్టింది.నల్గొండ జిల్లా నుంచి ఇబ్రహీంపట్నంకు వెళ్తున్న టిప్పర్ డ్రైవర్ బహిర్భూమి కోసం అప్పుడే టిప్పర్‌ను అక్కడ ఆపి వెళ్లాడు. కంటైనర్ డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో ముందు ఉన్న వాహనాన్ని గుర్తించలేకపోయాడు. ఢీకొన్న ధాటికి కంటైనర్ లోడులోని మద్యం సీసాలు క్యాబిన్‌లోనికి చొచ్చుకొచ్చి బద్ధలుకాగా భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ రవీంద్రసింగ్ కుస్వాహ్ కాలిబూడిదయ్యాడు. ఆకస్మాత్తుగా సంభవించిన ఈఘటనతో రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. కంచికచర్ల ఎస్‌ఐ కే ఈశ్వరరావు ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.