బాబు పాలనలో కరువు వెంటాడుతోంది
- రైతు సమస్యలపై మేలో భారీ నిరసన
- చేతకాని అసమర్థుడు పల్లె
- దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ధ్వజం
పుట్టపర్తి అర్బన్ : చంద్రబాబు పదవి చేపట్టిన నాటి నుంచి కరువు వెంటాడుతోందని పుట్టపర్తి నియోజకవర్గం సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ధ్వజమెత్తారు. పుట్టపర్తి సాయి ఆరామంలో శుక్రవారం వైఎస్సార్‌సీపీ నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ భూగర్భజలాలు అడుగంటి పంటలు పండక తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు కనిపిస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదని మండిపడ్డారు. ఉపాధి పనులు లేకపోవడంతో కూలీలు, రైతులు వలసబాట పట్టారన్నారు. రెయిన్ గన్లతో పంటలు రక్షిస్తామని చెప్పి కోట్లాది రూపాయలు ప్రజాధనం వృథా చేశారన్నారు. కేవలం పార్టీ నాయకులను బతికించడానికి నీరు చెట్టు పనులు చేయించి కమీషన్లు పొందుతున్నారన్నారు.
ఇక స్థానిక ఎమ్మెల్యే పల్లె మంత్రి పదవి ఉన్నంత కాలం పుట్టపర్తి గురించి పట్టించుకోని అసమర్థుడన్నారు. అనంతలో 13 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు ఉన్నా అభివృద్ధిని విస్మరించారన్నారు. సీఎం కేవలం ఎయిర్‌పోర్టు కోసమే పుట్టపర్తిని వినియోగించుకుంటున్నారన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని అన్ని చెరువులకు హంద్రీ-నీవా నీళ్లు ఇవ్వాలని ఒక్కరైనా సీఎంను అడిగే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. రైతులు, డ్వాక్రా మహిళలు, ప్రజల సమస్యలు పరిష్కారం కోరుతూ మే మూడో వారంలో వేలాది మందితో నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు చెప్పారు.
ధర్నాకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆహ్వానిస్తామన్నారు. తీవ్ర వర్షాభావం నేపథ్యంలో పంటలు పూర్తిగా ఎండిపోవడంతో ప్రభుత్వం బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ రెండూ ఇవ్వాలన్నారు. ఏ ఒక్కటి ఇవ్వకున్నా పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టి బీమా కంపెనీపై కోర్టుకు వెళ్తామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ హరికృష్ణ, పుట్టపర్తి మండల, పట్టణ, ఓడీసీ, కన్వీనర్లు గంగాద్రి, మాధవరెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర నాయకులు లోచర్ల విజయభాస్కర్‌రెడ్డి, కేశవరెడ్డి, మాధవప్ప, ఈశ్వరరెడ్డి, సహకార సంఘం అధ్యక్షులు ఏవీ.రమణారెడ్డి, నరసారెడ్డి, కౌన్సిలర్ నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్‌లు తిప్పారెడ్డి, చిత్తరంజన్‌రెడ్డి, చెన్నకృష్ణ, రామ్మోహన్, బీడుపల్లి శ్రీధర్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.