కామారెడ్డిలో విధులు నిర్వహించలేం
కామారెడ్డిలో విధులు నిర్వహించలేం
Published Fri, Oct 14 2016 11:39 PM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM
• విధుల్లో చేరకుంటే తొలగిస్తామని అధికారి హెచ్చరికలు
• సీపీ జోక్యంతో ఆర్డర్ రద్దు
నిజామాబాద్ క్రైం :
పోలీస్‌శాఖలో చిన్న ఉద్యోగులైన తమను కామారెడ్డి జిల్లాకు బదిలీ చేయటం అన్యాయమని, అక్కడ విధులు నిర్వహించలేమంటూ పోలీస్ పరేడ్ మైదానంలో హోంగార్డులు శుక్రవారం నిరసనకు దిగారు. చాలీచాలనీ జీతంతో కామారెడ్డిలో పని చేయలేమని, తమను విధుల్లో నుంచి తొలగిస్తే చావే శరణ్యమని వారు వాపోయారు. వివరాలిలా ఉన్నాయి.. జిల్లా నుంచి కామారెడ్డి వేరు కావడంతో పోలీస్ సిబ్బందిని రెండు జిల్లాలకు విభజించారు. ఈ విధానాన్ని హోంగార్డులకు కూడా వర్తింపజేశారు. జిల్లాలో మొత్తం 649 మంది హోంగార్డులు విధులు నిర్వర్తిస్తుండగా వీరిలో 428 మందిని నిజామాబాద్‌కు, 221 మందిని కామారెడ్డికి బదిలీ చేశారు. కాగా 221 మందిలో 120మంది కామారెడ్డికి చెందిన వారు కావడంతో వారంతా కామారెడ్డి జిల్లాకు వెళ్లారు. మిగిలిన 62 మంది నిజామాబాద్‌లో డీఐజీ, ఎస్పీ, డీఎస్పీ, ఏసీబీ, ఏఆర్ విభాగాల్లో, పోలీస్‌శాఖ గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తున్నారు. ఇందులో నుంచి కూడా కొంతమందిని కామారెడ్డి జిల్లాకు బదిలీ చేయటంతో వారు ఆందోళన చెందారు. దీంతో వారంతా శుక్రవారం జిల్లా పోలీస్ పరేడ్ మైదానానికి చేరుకుని నిరసనకు దిగారు. తమకు వచ్చే తక్కువ జీతంతో కామారెడ్డిలో అద్దె ఇళ్లలో భార్యాపిల్లలతో ఎలా బతికేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఏఆర్ ఎస్సై ఒకరు హోంగార్డుల వద్దకు వచ్చి ఖచ్చితంగా కామారెడ్డికి వెళ్లాలని, వెళ్లని వారిని విధుల నుంచి తొలగిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. తమను విధుల నుంచి తొలగిస్తే చావే శరణ్యమంటూ హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్‌లో పిల్లలు చదువులు మధ్యలో నిలిపివేసి కామారెడ్డికి వెళ్లలేమని, భారాపిల్లలను, తల్లిదండ్రులను ఇక్కడ వదిలేసి తాము కామారెడ్డికి నిత్యం వెళ్లిరావాలన్నా రోజుకు రూ. 200 ఖర్చు అవుతుందని అధికారి ముందు ఆవేదన చెందారు. విషయం తెలుసుకున్న మీడియా పోలీస్ పరేడ్ మైదానంకు చేరుకోవటంతో మీడియా ముందు హోంగార్డులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని తెలిపారు. దీంతో ఏఆర్ అధికారులు విషయాన్ని పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లటంతో స్పందించిన సీపీ కామారెడ్డికి బదిలీ అయిన హోంగార్డుల ఆర్డర్‌ను రద్దు చేశారు. అనంతరం ఏఆర్ ఎస్సై హోంగార్డుల వద్దకు చేరుకుని మీ ఆర్డర్ రద్దు అయ్యిందని, తదుపరి ఆర్డర్ వచ్చే వరకు ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడే విధుల్లో చేరాలని తెలుపటంతో వారు విధులకు వెళ్లిపోయారు.
Advertisement