వృద్ధాశ్రమ నిర్వాహకురాలి ఇంటిపై ఈడీ, ఐటీ దాడులు
భారీగా లావాదేవీలు, నగదు ఉందన్న అనుమానంతో సోదాలు?
అనంతపురం జిల్లాలో ఘటన
యాడికి: ఓ వృద్ధాశ్రమ నిర్వాహకురాలి ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఇన్‌కమ్ ట్యాక్స్ (ఐటీ) అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. అనంతపురం జిల్లా యాడికి మండలం రాయలచెరువులోని ‘లీలావతి వృద్ధాశ్రమం’ నిర్వాహకురాలు కృష్ణవేణి ఇల్లు, ఆశ్రమంలో గురువారం బెంగళూరు నుంచి వచ్చిన ఈడీ, ఐటీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. బ్యాంకు అకౌంట్ నుంచి కృష్ణవేణి ఎక్కువ మొత్తంలో లావాదేవీలు జరగడంతో పాటు, ఆమె ఇంట్లో భారీ మొత్తంలో నగదు ఉన్న సమాచారంతో అధికారులు దాడులు చేసినట్లు తెలుస్తోంది. సుమారు గంటసేపు తనిఖీలు చేసిన అధికారులు.. వృద్ధాశ్రమానికి వచ్చిన నిధులు తదితరాలపై నిర్వాహకురాలిని ప్రశ్నించారు. గతంలో తనపై ఉన్న కేసులకు సంబంధించిన విషయాలను కృష్ణవేణిని అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం కూడా ఐటీ అధికారులు వస్తారనీ, వారికి సహకరించాలని ఆమెకు చెప్పి వెళ్లిపోయారు. కృష్ణవేణి ఇంటిని పోలీసులు దిగ్బంధించడంతో పూర్తి వివరాలు తెలియలేదు. మీడియా అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పలేదు.
గతంలోనూ కృష్ణవేణిపై కేసులు
‘తేజ విమెన్ ఎడ్యుకేషనల్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ’ని స్థాపించి దాని ఆధ్వర్యంలో లీలావతి వృద్ధాశ్రమం నడుపుతున్న కృష్ణవేణిపై ఇదివరకే రెండు కేసులు నమోదై ఉన్నాయి. కోల్‌కత్తలోని ఓ వ్యక్తిని మోసం చేసి అతని అకౌంట్ నుంచి వృద్ధాశ్రమ అకౌంట్‌లోకి రూ. 12 లక్షలు వేయించుకుందన్న ఆరోపణలపై ఆ రాష్ట్ర పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అలాగే తనను కృష్ణవేణి మోసం చేసి రూ. 2.35 కోట్లను తన ఖాతాలో వేసుకుందని ఢిల్లీకి చెందన సంజయ్ కొఠారీ అనే వ్యక్తి 2014 నవంబర్ 17న తాడిపత్రి డీఎస్పీకి ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది.