ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థులు
విద్య కాషాయీకరణ
Published Sun, Aug 7 2016 6:04 PM | Last Updated on Thu, Jul 11 2019 5:12 PM
ఏఐఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వలి ఉల్లాఖాద్రి
గుంటూరు వెస్ట్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విద్య కాషాయీకరణ వేగవంతమైందని ఏఐఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వలి ఉల్లాఖాద్రి తెలిపారు. ఏఐఎస్‌ఎఫ్ 80వ వార్షికోత్సవం శనివారం గుంటూరులో జరిగింది. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి లాడ్జిసెంటర్‌లోని మహిమా గార్డెన్స్ వరకు ఏఐఎస్‌ఎఫ్ నాయకులు, కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం నిర్వహించిన బహిరంగసభలో వలి ఉల్లాఖాద్రి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుంచి విద్యారంగంలో తీసుకువస్తున్న మార్పులతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. హర్యానా రాష్ట్రంలో దొంగబాబా చర్రితను పాఠ్యాంశాల్లో చేర్చడాన్ని ఖండించారు. విశ్వవిద్యాలయాలకు ఆర్‌ఎస్‌ఎస్ వ్యక్తులను వీసీలుగా నియమిస్తూ విద్యావ్యవస్థను మత పరం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. విద్యార్థి సంఘ నాయకులను దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. దేశంలో సుమారు లక్ష పాఠశాలలను మూసివేయించిన ఘనత మోడీ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన విమర్శించారు.
విద్యా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి..
పద్మశ్రీ అవార్డు గ్రహీత కొలకలూరి ఇనాక్ మాట్లాడుతూ దేశంలో కలుషితమైన రాజకీయాల నుంచి ప్రజలను విముక్తి చేసే సత్తా విద్యార్థులకే ఉందన్నారు. పాలకులు అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను విద్యార్థులు ఐక్యంగా తిప్పికొట్టాలని కోరారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను పాలకులు విస్మరించి, యువతకు అన్యాయం చేశారని విమర్శించారు. కార్యక్రమంలో ఏఎన్‌యూ మాజీ వైస్ చాన్సలర్ వియన్నారావు, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్, రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సుబ్బారావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు బయ్యన్న, ప్రజానాట్య మండలి జాతీయ కార్యదర్శి పులి సాంబశివరావు, రాష్ట్ర అధ్యక్షుడు గని, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి కె.రామయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తీర్మానాలు..
ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల మూసివేతను ఉపసంహరించుకోవాలని, విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, తక్షణమే ఏపీకి హోదా ప్రకటించాలని తదితర తీర్మానాలను సభలో ఆమోదించారు.
Advertisement
Advertisement