ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు విద్యావ్యవస్థను ధ్వంసం చేశారని, దానిని గాడిలో పెట్టేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు.
- డిప్యూటీ సీఎం కడియం
మేడ్చల్ (రంగారెడ్డి జిల్లా)
ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు విద్యావ్యవస్థను ధ్వంసం చేశారని, దానిని గాడిలో పెట్టేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం గిర్మాపూర్‌లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కశాశాల భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడారు. గత ప్రభుత్వాలు పాలిటెక్నిక్, జూనియర్ కళాశాలలు మంజూరు చేసినా వాటిని భవనాలు నిర్మించలేదని, అధ్యాపకులను కేటాయించలేదని విమర్శించారు. 20 ఏళ్లుగా ధ్వంసం అయిన విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
తాము అన్ని పాఠశాలలు, కళాశాలలకు భవనాలు ఏర్పాటు చేసి ఉపాధ్యాయులను నియమిస్తామని శ్రీహరి హామీ ఇచ్చారు. విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం విద్యాశాఖపై ప్రత్యేక చొరవ తీసుకుంటోందని దళిత, పేద విద్యార్ధులకు అన్ని వసతులతో నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని వివరించారు.