అత్యవసరం అయితే ప్రైవేటుకే
అందుబాటులో లేని వెంటిలేటర్లు
గాలిలో కలిసిపోతున్న ప్రాణాలు
ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ఇదీ పరిస్థితి
సాక్షి ప్రతినిధి, ఏలూరు ః
అత్యవసరం అయితే ప్రైవేటు ఆసుపత్రిని ఆశ్రయించాలి.. లేదంటే ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. జిల్లా కేంద్రమైన ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే వెంటిలేటర్లు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రమాదాల్లో గాయపడ్డ వారి పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. దీంతో ప్రభుత్వాసుపత్రి నుంచి విజయవాడకు గాని లేకపోతే ప్రైవేటు ఆసుపత్రికిగాని రిఫర్ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
మూడు వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నా వాటిని ఉపయోగించే సిబ్బంది లేరన్న కారణంగా వాటిని వాడలేని దుస్థితి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో ఉంది. ప్రమాదాలలో తీవ్రగాయాల పాలై చివరి క్షణాల్లో ఉన్నవారికి అత్యవసర వైద్య సేవలందించేందుకు ఒక్కొక్కటి రూ. ఐదు లక్షల విలువైన మూడు వెంటిలేటర్‌లు, సీప్యాప్ (రోగిని ప్రాణాపాయం నుంచి కాపాడే క్రమంలో వెంటిలేటర్ పైపు స్వరపేటికలో అమరుస్తారు)లు రెండు జిల్లా ఆసుపత్రిలో ఉన్నాయి. ఈ పరికరాలు అన్నీ ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటుచేసి యేడాదిన్నర కావస్తోంది. అయితే వాటిని నిర్వహించేందుకు అవసరమైన మూడు ఇంటెన్సివిస్ట్ పోస్టులు, ఆరు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నిషియన్స్(ఇఎమ్‌టీ) పోస్టుల భర్తీ ఊసేలేక పోవడంతో ఆ తొమ్మిది పోస్టులు నేటికీ ఖాళీగానే ఉన్నాయి. దీంతో ఆసుపత్రిలో పాతిక లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన మూడు వెంటిలేటర్స్, రెండు సీ ప్యాప్ (కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెజర్)లు నిరుపయోగంగా పడి ఉన్నాయి.
ఇవి అందుబాటులోకి రాకపోవడంతో నిత్యం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో గాయపడి ఏలూరు జిల్లా ఆసుపత్రికి వస్తున్న బా«ధితుల ప్రాణాలు కాపాడేందుకు అవకాశం లేకపోతోంది. శనివారం లింగపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చింతలపూడి ఎస్సై బాణోతు సైదానాయక్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆయన భార్య శాంతిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో ఆమె ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన లైఫ్ సపోర్టర్ అంటే వెంటిలేటర్ ఉన్నా దానిని ఆపరేట్ చేసేందుకు నిపుణుడైన ఇంటెన్సివిస్ట్ లేకపోవడంతో వైద్యులు ఆమెను అత్యవసరంగా ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే గోల్డెన్ సెకండ్స్ (ప్రాణాపాయ పరిస్థితుల్లో బాధితునికి వైద్యం అందించే క్షణాలు) వృథా కావడంతో ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోవడమే కాకుండా వారి ఏడాదిన్నర వయసున్న చిన్నారి అనాథగా మిగిలిపోయింది. ఇది తాజా ఉదాహరణ మాత్రమే. వాస్తవానికి జిల్లాలో నిత్యం జరుగుతున్న రోడ్డు తదితర ప్రమాదాలలో తీవ్రగాయాలపాలై కొనఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఆసుపత్రికి వచ్చే బాధితుల సంఖ్య సగటున రోజుకు 45 వరకూ అంటే నెలకు వందమందికి పైబడిన బాధితులు ఏలూరు ఆసుపత్రికి వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వారిని ప్రాణాపాయం నుంచి కాపాడేందుకు అవసరమైన యంత్ర పరికరాలు ఉన్నా వాటిని నిర్వహించే నిపుణులు లేని కారణంగా పలువురు క్షతగాత్రులు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజల ఆరోగ్యం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామంటూ నిత్యం ప్రకటనలు గుప్పించే ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి వీటిని అపరేట్ చేసే సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.