కూలీ.. కడుపు ఖాళీ | Employment work wage arrears | Sakshi
Sakshi News home page

కూలీ.. కడుపు ఖాళీ

Published Mon, Mar 6 2017 10:52 PM | Last Updated on Tue, Oct 2 2018 6:35 PM

కూలీ.. కడుపు ఖాళీ - Sakshi

కూలీ.. కడుపు ఖాళీ

► నెలలుగా వేతనానికి నోచుకోని ‘ఉపాధి’ కూలీలు
►  పనులకు వెళ్లేందుకు విముఖత
►  గణనీయంగా తగ్గిన కూలీల సంఖ్య
► హాజరుకావాలని కోరుతున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లు
► జిల్లాలో రూ. 8.45 కోట్ల వేతన బకాయిలు
► ప్రగతిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం


స్వేదం చిందించి శ్రమను నమ్ముకున్న బతుకులు భారంగా కాలం వెళ్లదీస్తున్న దృశ్యాలు జిల్లాలో అడుగడుగునా కళ్లకు కడుతున్నాయి. ఎన్నో నిరుపేద కుటుంబాలకు ‘ఉపాధి’ పనులే ఊతం. వీటి ఆధారంగా వచ్చే వేతనాలతోనే వారు జీవనం సాగిస్తున్నారు. నిధుల విడుదలలో తీవ్ర జాప్యం చోటుచేసుకోవడంతో చేతిలో డబ్బులు లేక కూలీలు అగచాట్లు పడుతున్నారు. తమ దయనీయ పరిస్థితిపై అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో చివరకు వారు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘పది వారాలపాటు పనిచేసిన డబ్బులు ఇంతవరకు రాలేదు. ఎప్పుడొస్తాయో ఇప్పటికీ తెలియదు. ఉపాధి పనుల డబ్బులు వస్తేనే.. మా కుటుంబం గడిచేది. నెలల తరబడి ఒక్క పైసా కూడా మా ఖాతాల్లో పడకుంటే ఏం తినాలి? ఎలా బతకాలి? నిధులు విడుదల చేశాకే మళ్లీ పనులకు వస్తాం. అప్పటిదాకా మా దారి వేరే’. జిల్లాలోని ఉపాధి హామీ పథకం కూలీల మనోవేదన ఇది.

ఏ కూలీని పలకరించినా దాదాపు ఇదే సమాధానం వస్తోంది. ఫలితంగా పనులపై వారు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో ప్రస్తుతం పనుల్లోకి వచ్చే కూలీల సంఖ్య క్రమేపీ గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. ఉపాధి పనుల నిర్వహణకు మార్చి నెల అత్యంత కీలకం. ఇదే నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగియనున్న విషయం తెలిసిందే. ఈ లోగా నిర్దేశించుకున్న లక్ష్యాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాల్సి ఉంటుంది.

అలాగే ఈ నెలలో వ్యవసాయ, దాని అనుబంధ పనులు కాస్త తక్కువగానే ఉంటాయి. దీంతో ప్రత్యామ్నాయంగా ఉపాధి పనులకు కూలీలు అధిక సంఖ్యలో హాజరవుతారు. గతేడాది ఇదే నెలలో పనుల్లోకి వచ్చిన వారి సంఖ్య దాదాపు 41 వేలు. ప్రస్తుతం 31 వేలకే పరిమితం కావడం ఆందోళన కలిగిస్తోంది.

తీవ్ర నష్టమే..
ప్రతి నిరుపేద కుటుంబం ఒక ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పథకం ద్వారా వంద రోజుల పని పొందవచ్చు. దీనికి గడవు ఈ నెలాఖరు. ఇప్పటివరకు జిల్లాలో దాదాపు 9,300 కుటుంబాలు వంద రోజుల ఉపాధి పొందాయి. మరో 4 వేలకు పైగా కుటుంబాలు 80 రోజుల పని మార్క్‌ను చేరుకున్నాయి. మరో 20 రోజులు పనుల్లోకి వెళ్తే ఉపాధి లక్ష్యం పరిపూర్ణం అవుతోంది. అయితే ఇప్పటికే చేసిన పనులకు సంబంధించిన వేతనాలు విడుదల కావడంతో వారంతా కొన్ని నెలలుగా పనులకు దూరంగా ఉంటున్నారు. నిధుల విడుదల మరింత జాప్యమైతే ఈ కూలీలు పని దినాలను నష్టపోయినట్లేనని స్పష్టమవుతోంది. మిగిలిన కుటుంబాలు కూడా ఉపాధిని కోల్పోయినట్లేనని కార్మిక నేతలు చెబుతున్నారు.

పనులపై ప్రతికూల ప్రభావం..
ఉపాధిలో భాగంగా నీటి సంరక్షణ, స్వచ్ఛత పనులపై గ్రామీణాభివృద్ధి శాఖాధికారులు దృష్టి సారించారు. నీటి, ఊట కుంటలు, ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్ల తదితర పనుల లక్ష్యాలను ఈనెలాఖరులోగా చేరుకోవాల్సి ఉంది. అయితే ఆశించిన స్థాయిలో కూలీలు పనుల్లోకి రాకపోవడంతో ప్రగతిపై కొంత ప్రతికూల ప్రభావం అవకాశం లేకపోలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ పరిస్థితి తలెత్తకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లను పనుల్లోకి రాని కూలీల వద్దకు రాయబారం పంపుతున్నారు. డబ్బులు ఎక్కడికీ పోవని.. త్వరలో వస్తాయని వారికి నచ్చేజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి పనులకు హాజరుకావాలని వారిని కోరుతున్నారు. అయితే చాలా మంది కూలీలు మెట్టు దిగడం లేదు. వేతనాలు రాకపోవడంతో కుటుంబం గడవడం లేదని.. ఇలాంటప్పుడు పనుల్లోకి ఎలా వస్తామని వారు ప్రశ్నిస్తున్నారు.

పెండింగ్‌లో రూ. 8 కోట్లకు పైమాటే..
జిల్లాలో ప్రస్తుతం నిత్యం సగటున 32 వేల మంది కూలీలు పనులకు వెళ్తున్నారు. ఏడాది ఆసాంతం (గతేడాది వేసవి నుంచి ఇప్పటి వరకు) దాదాపు 1.30 లక్షల మంది ఉపాధి పనులకు హాజరయ్యారని అంచనా. వివిధ రకాల అభివృద్ధి పనుల కోసం ఈ ఏడాదిలో ఇప్పటివరకు సుమారు రూ. 62 కోట్లు ఖర్చు పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు.

ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు వ్యయం చేసినా.. కూలీలకు మాత్రం సకాలంలో వేతనాలు అందడం లేదు. దాదాపు 65 వేల మంది కూలీలకు రూ. 8.45 కోట్లు వేతన బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. గత నవంబర్‌ వరకు అరకొరగా వేతనాలు ఇస్తూ నెట్టుకొచ్చారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఒక్కపైసా విడుదల కాలేదని సమాచారం. పనిచేసిన 15 రోజుల్లోగా కూలీలకు వేతనాలు అందాల్సి ఉంది. కానీ, ఆ మేరకు జిల్లాలో పరిస్థితులు లేకపోకవడంతో కూలీలు సతమతం అవుతున్నారు. ఒక్కో కూలీకి వేల రూపాయల వేతనం రావాల్సి ఉంది.

అయినా ఆలస్యమే...
గతంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని కూలీల ఖాతాల్లో జమచేసేది. ఈ విధానంతో వేతనాల అందజేతలో తీవ్ర జాప్యం చోటుచేసుకునేది. అంతేగాక సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం.. కూలీల ఖాతాల్లో జమ చేయ కపోవడంతో కొంత వ్యతిరేకత వచ్చింది. దీన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల మరో నిర్ణయం తీసుకుంది. నేరుగా కూలీల బ్యాంకు ఖాతాల్లోనే వేతనాలు జమ చేయాలని నిశ్చయించుకుంది. గత జనవరి నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చిందని అధికారులు చెబుతున్నారు.

అయితే రాష్ట్రానికి కేటాయింపులు జరిపిన నిధుల్లోంచే.. కేంద్రం కూలీలకు వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది కేంద్రం.. రాష్ట్ర కోటా కింద రూ.300 కోట్లను కేటాయించినట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ మొత్తం నిధుల వినియోగం ఇప్పటికే పూర్తయ్యిందని అధికారులు చెబుతున్నారు. మరో దఫా నిధుల విడుదలపై కార్యాలయాల మధ్య ఫైళ్లు కదులుతున్నాయని.. తొందరలోనే ఈ సమస్య కొలిక్కి వస్తుందని వివరిస్తున్నారు. దీనిపై డీఆర్‌డీఓ ప్రశాంత్‌ కుమార్‌ను వివరణ అడగగా.. త్వరలోనే డబ్బులు కూలీల ఖాతాల్లో జమ అవుతాయని సమాధానమిచ్చారు. పెండింగ్‌లో ఉన్న మొత్తం నిధులు వస్తాయని చెప్పారు.

రూ.6వేలు రావాలి
నేను, నా భర్త ఉపాధి హామీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాం. వచ్చిన కూలిడబ్బులే మాకు ఆధారం. ఇప్పటివరకు ఏడు వారాలకు సంబంధించిన దాదాపు రూ. 6 వేలు అందాల్సి ఉంది. కాని నేటికీ నయాపైసా అందలేదు. ఫీల్డ్‌ అసిస్టెంట్‌ను అడిగితే.. గడువు పెడుతున్నా మార్పు లేదు. చేతిలో పైసలు లేక ఇంట్లకు అవసరమైన వస్తువులు కొనాలంటే చాలా ఇబ్బందిగా మారింది.  చివరకు ఉప్పు, పప్పు, కూరగాయలకూ వెనకాముందు ఆలోచిస్తున్నాం. అత్యవసరమైతే అప్పు చేస్తున్నాం. – కట్టెలబాలమ్మ, ఉపాధి కూలి, పోల్కంపల్లి

రూ.3,653 రావాల్సి ఉంది
ఐదు వారాలు పనులు చేస్తే ప్లే స్లిప్పులు వచ్చాయి. మొత్తం రూ.3,653 రావాల్సి ఉంది. కాని నేటికీ చెల్లించలేదు. ఎర్రటి ఎండల్లో కష్టపడి పని చేస్తే శ్రమకు తగిన ఫలితం రావడం లేదు. బయట పనికి వెళ్లకుండా ఉపాధిని నమ్ముకుంటే నిరాశకు గురి కాకతప్పడం లేదు. అధికారులను అడిగితే మేము బిల్లులు చేసి పంపించాం.... ప్రభుత్వం నుంచే రావడం లేదని చెబుతున్నారు. కూలి డబ్బులు తొందరగా అందించి ఆదుకోవాలి. –గూడెం దానయ్య, కూలీ, పోల్కంపల్లి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement