పరిశ్రమల స్థాపనకు ఆసక్తి ఉంటే చాలు : కలెక్టర్
అనంతపురం ఎడ్యుకేషన్ : ఆసక్తి ఉంటే చాలు ఎలాంటి పరిశ్రమలైనా స్థాపించవచ్చని కలెక్టర్ జి.వీరపాండియన్ అన్నారు. శుక్రవారం స్థానిక ఆర్ట్స్ కళాశాల డ్రామా హాలులో ఏర్పాటు చేసిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల దినోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పరిశ్రమలు స్థాపించాలంటే కోట్లాది రూపాయలు పెట్టుబడి అవసరం లేదన్నారు. జిల్లాలో 4 వేల చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల ద్వారా దాదాపు 75 వేల మందికి ఉపాధి దొరుకుతోందన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక రాయితీలు కల్పిస్తోందన్నారు. ఇటీవలే 61 మంది పారిశ్రామికవేత్తలకు రూ.5 కోట్ల ప్రోత్సాహకాలు అందించామన్నారు. ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, పరిశ్రమల శాఖ జీఎం సుదర్శన్‌బాబు, మేయర్ స్వరూప, ఎల్‌డీఎం జయశంకర్, ఇతర బ్యాంకర్లు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.