సంప్రదాయ కళలను ప్రోత్సహిద్దాం
కర్నూలు (కల్చరల్): భారతీయ సంప్రదాయ కళలను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. స్థానిక బిర్లాగేట్ సమీపంలోని శ్రీలక్ష్మి ఫంక్షన్‌హాలులో ఎస్వీ సుబ్బారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి నృత్య పోటీలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్వీ పౌండేషన్ వారు ప్రతి సంవత్సరం శాస్త్రీయ జానపద నృత్య పోటీలను నిర్వహిస్తూ కళాకారులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ఎస్వీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా ఎస్వీ ఫౌండేషన్ రాష్ట్రస్థాయి నృత్య పోటీలను నిర్వహిస్తూ కళాకారులను ఉత్తమ కళాకారులుగా రాణించేందుకు అవకాశం కల్పిస్తోందన్నారు.
ఆకట్టుకున్న శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు:
ఎస్వీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక శ్రీలక్ష్మి ఫంక్షన్‌హాలులో జరిగిన రాష్ట్రస్థాయి నృత్య పోటీలల్లో వివిధ జిల్లాలకు చెందిన కళాకారులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రధానంగా చిన్నారులు చేసిన స్వాగత నృత్యం, దుర్గామాత తదితర నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ కేంద్ర క్రమశిక్షణా సంఘం సభ్యులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎస్వీ ఫౌండేషన్ కార్యాధ్యక్షులు రాయపాటి శ్రీనివాస్, కర్నూలు శారదా సంగీత కళాశాల ప్రిన్సిపాల్ రామచంద్రన్, పోటీల న్యాయ నిర్ణేతలు విజయలక్ష్మి, నాగసాయి ప్రదీప్, ఎలమర్తి రమణయ్య, పల్లె గోపాల్ తదితరులు పాల్గొన్నారు.