గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలి
– ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
– ముగిసిన జిల్లాస్థాయి ఖోఖో పోటీలు
హుజూర్‌నగర్ : గ్రామీణ ప్రాంతాల క్రీడాలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్‌గేమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి అండర్–14 ఖోఖో పోటీలు సోమవారం ముగిసాయి. ముగింపు సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ గల క్రీడాకారులు ఉన్నారని, వారిని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని అన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు విద్యావ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఆ మాటే మర్చిపోయాడని విమర్శించారు. సుదీర్ఘ కాలంగా వ్యాయామ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను తాను శాసనసభలో ప్రస్తావిస్తానని ఈ సందర్భంగా ఉత్తమ్ హామీ ఇచ్చారు. ఇటీవల కురిసిన భారీవర్షాలకు పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలన్నారు. అలాగే వర్షాలతో కూలిపోయిన పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరీ కోసం రూ.లక్ష కేటాయిస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఖోఖోలో విజేతలైన జట్లకు షీల్డ్‌లు అందజేశారు. కార్యక్రమంలో హుజూర్‌నగర్, గరిడేపల్లి జడ్పీటీసీలు హఫీజానిజాముద్దీన్, పెండెం శ్రీనివాస్‌గౌడ్, నాయకులు యరగాని నాగన్నగౌడ్, తన్నీరు మల్లికార్జున్‌రావు, కీతా మల్లికార్జున్, ఎంఈఓ లక్‌పతినాయక్, పీఈటీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కాగా, బాలుర విభాగంలో ఫైనల్ తలపడిన మిర్యాలగూడ డివిజన్– దేవరకొండ డివిజన్లలో మిర్యాలగూడ డివిజన్ గెలుపొంది. అలాగే బాలికల విభాగంలో భువనగిరి–సూర్యాపేట డివిజన్లు తలపడగా భువనగిరి డివిజన్ విజయం సాధించింది.