దేవాదాయశాఖ స్థలంలో అన్యమత ప్రచారం | endoment department site issue | Sakshi
Sakshi News home page

దేవాదాయశాఖ స్థలంలో అన్యమత ప్రచారం

Published Fri, Dec 2 2016 12:26 AM | Last Updated on Mon, Sep 4 2017 9:38 PM

endoment department site issue

  • పాక తొలగింపులో ఉద్రిక్తత
  • కాకినాడ రూరల్‌ : 
    దేవాదాయ ధర్మాదాయశాఖకు చెందిన భూమిని లీజుకు తీసుకుని ఆ భూమిని అన్యమత ప్రచారానికి వినియోగిస్తున్నారన్న ఫిర్యాదుపై గురువారం దేవాదాయ, ధర్మాదాయ శాఖాధికారులు భూమిలో వేసిన పాకలను తొలగించేందుకు ప్రత్నించగా లీజుదారులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  కాకినాడ రూరల్‌ మండలం వాకలపూడి పంచాయతీ సర్వేనంబర్లు 102/1ఏ, 1బి, 1సిల్లో కాకినాడ అన్నదాన సమాజానికి చెందిన 8.41 ఎకరాల స్థలం దేవాదాయ ధర్మాదాయశాఖ ఆధీనంలో ఉంది. ప్రతి మూడేళ్లకు అందులో ఫలసాయం అనుభవించేందుకు, తోటలు నిర్వహణకు లీజుకిస్తుంటారు. అందులో భాగంగా 2016–18 ఆర్థిక సంవత్సరానికి వన్నెపూడి వెంకటరమణ లీజుకు తీసుకున్నారు. ఈ స్థలంలో క్రైస్తవ సభలు నిర్వహిస్తున్నారని, విద్యార్థులతో క్రైస్తవ తరగతులు నిర్వహిస్తున్నారని కొందరు దేవాదాయ, ధర్మాదాయ శాఖాధికారులకు, హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. ఆ స్థలంలో పాకలను తొలగిస్తే లీజును కొనసాగించాలని కోర్టు ఆదేశాలిచ్చింది. అయినా వెంకటరమణ ఆ స్థలంలో పాకను తొలగించకుండా జాప్యం చేయడంతో రీజనల్‌ జాయింట్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌ఆజాద్‌ ఆదేశాల మేరకు  గ్రేడ్‌–1 ఈవో ఎస్‌ రాధ నాయకత్వంలో ఈవోలు వుండవిల్లి వీర్రాజుచౌదరి, నరసింహరాజు, రమణమూర్తి, రాజేశ్వరరావు, సూర్యనారాయణ పాకను తొలగించే ప్రయత్నం చేశారు. సగభాగం కూల్చే సమయానికి లీజుదారుడు కొందరు వ్యక్తులతో వచ్చి పాకను తొలగించొద్దని, వచ్చే ఏడాది వరకు లీజు ఉందని, దీనికి సంబంధించి కోర్టు ఆర్డరు కూడా ఉందంటూ వాదనకు దిగారు. దీనిపై అధికారులు స్పందించి కోర్టు ఆర్డర్‌ ప్రకారం ఎన్నిసార్లు హెచ్చరించినా పెడచెవిన పెట్టడంతో లీజును రద్దు చేయడం జరిగిందని, స్థలాన్ని తాము స్వాధీనం చేసుకుంటున్నామని వివరించారు. లీజు రద్దు చేస్తున్నట్లు కోర్టు ఆర్డర్‌ ఇవ్వలేదని, కేవలం పాకను మాత్రమే తొలగించమని ఇచ్చిందని లీజుదారుడైన వెంకటరమణ, అతనితో పాటు వచ్చిన కొందరు వాదనకు దిగారు. దీంతో అధికారులు రీజనల్‌ జాయింట్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌ఆజాద్‌తో మాట్లాడారు. రెండు రోజుల్లో పాకను తొలగిస్తామని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని లీజుదారుడు అధికారులకు , రాతపూర్వకంగా ఇవ్వడంతో అధికారులు ఆమోదించారు. లీజుదారుడు అన్యమత ప్రచారాలకు వినియోగించకుంటే కోర్టు తీర్పు ప్రకారం లీజు కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.  సర్పవరం పోలీసులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement