సాక్షి, కాకినాడ రూరల్ : తెలుగుదేశం పార్టీని పైకి లేపేందుకు ఎల్లో మీడియా ఎన్ని జాకీలు వేస్తున్నా ఫలితం కనిపించడంలేదు. ఏ నియోజకవర్గం చూసినా పచ్చ పార్టీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారిపోతోంది. కాకినాడ రూరల్ సెగ్మెంట్‌లో సైకిల్ పార్టీకి కనీసం ఇన్‌చార్జ్‌ను నియమించుకోలేని దుస్థితి కనిపిస్తోంది. నడిపించే నాయకుడు లేకపోవడంతో నియోజకవర్గంలో గ్రూపులు కట్టి రోడ్డున పడుతున్నారు తెలుగు తమ్ముళ్ళు.
కాకినాడ రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో వర్గపోరు తారాస్ధాయికి చేరింది. లీడర్ లేకపోవడంతో స్థానిక నేతలంతా గ్రూప్‌లు కట్టి తమకే టిక్కెట్ అంటూ ప్రచారం చేసుకుంటుండంతో..ఇక్కడ క్యాడర్ అయోమయ స్ధితిలో కూరుకుపోయింది. గడిచిన సారత్రిక ఎన్నికల తరువాత రూరల్ టీడీపీ పరిస్ధితి చుక్కాని లేని నావలా తయారయింది. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మీతో పాటుగా ఆమె భర్త పిల్లి సత్యనారాయణ మూర్తి పార్టీలో తమ పదవులకు రాజీనామా చేసి సాధారణ కార్యకర్తల్లానే వ్యవహరిస్తున్నారు. చివరకు పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఈ తరుణంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కు అనుచరుడుగా చెప్పుకునే పేరాబత్తల రాజశేఖర్ కాకినాడ రూరల్ నియోజకవర్గంపై కన్నేశారు.
కోనసీమకు చెందిన రాజశేఖర్ కాకినాడ రూరల్ లో తిరగడంతో స్ధానిక టీడీపీ నేతలకు పుండు మీద కారం చల్లినట్లయింది. దీంతో యనమల రామకృష్ణుడి అనుచరుడైన పెంకే శ్రీనివాసబాబు రంగంలోకి వచ్చారు. కాకినాడ రూరల్ సీటు తనదే అంటూ కొంతమంది అనుచరులతో ప్రచారం ప్రారంభించారు. వీరితో పాటుగా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అనుచరుడైన వాదిరెడ్డి ఏసుదాసు కూడా సీటు ఆశించి రేసులో తానూ ఉన్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మళ్ళీ తెరమీదకు వచ్చారు పిల్లి అనంతలక్ష్మీ దంపతులు. ఇలా నాలుగు గ్రూపులుగా విడిపోయిన రూరల్ నియోజకవర్గం నేతలు సీటు కోసం ఫీట్లు చేస్తున్న తరుణంలో చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌కు అనుచరుడుగా చెప్పుకునే కటకంశెట్టి ప్రభాకర్ కాకినాడ రూరల్ పోటీ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇటీవల జరిగిన లోకేష్ పాదయాత్రకు అయిన ఖర్చులో కొంత ఆయన భరించినట్లు సమాచారం.
మరోవైపు జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా కాకినాడ రూరల్ సీటును జనసేనకు కేటాయిస్తారన్న ప్రచారం ఊపందుకుంది. జనసేనకు సీటు ఇస్తే తాము సపోర్ట్ చేసేది లేదని పిల్లి దంపతులు అధిష్టానానికి తమ మనస్సులో మాట చెప్పిందనే టాక్ నడుస్తోంది. ఇదే విషయాన్ని లోకేష్ కు కూడా చెప్పే ప్రయత్నం చేస్తే.. ముందు గ్రూపులు వదిలి అందరు కలిసికట్టుగా పని చేసుకోవాలని సూచించారని చెబుతున్నారు. ఇక ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ పరిస్ధితి ఏమీ బాగా లేదని...తనకు సీటు ఇస్తే ఎంతైనా ఖర్చు చేస్తానని లోకేష్‌కు చెప్పారట కటకంశెట్టి ప్రభాకర్. ఇలా టీడీపీలో ఎవరికి వారు సీటు కోసం ఫీట్లు చేస్తుంటే అంతంతమాత్రంగానే ఉన్న పార్టీ క్యాడర్ మాత్రం ఏం చేయ్యాలో తెలియక సతమతం అవుతుందట .
అసలు కార్యకర్తలే లేని జనసేనకు సీటు ఇస్తే.. ఆ పార్టీ అభ్యర్థి కోసం పనిచేయాల్సిన కర్మ తమకేంటని తెలుగుదేశంలో చర్చించుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి నాలుగు గ్రూపుల్లో ఎవరో ఒకరికి ఇస్తారా? లేక పార్టీని చక్కదిద్దుకోలేక జనసేనకే వదిలేస్తారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment