స.హ.చట్టం పరిధిలోకి దేవాదాయశాఖ
స.హ.చట్టం పరిధిలోకి దేవాదాయశాఖ
Published Fri, Sep 9 2016 11:22 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM
– చట్టాలను అమలు చేసే బాధ్యత పాలకులదే
– దేవాలయాల్లో ధర్మాన్ని నిలబెట్టాలి
– ఈఓ ఒకరు కోట్లలో అక్రమార్జన చేస్తే స.చట్టం వర్తించదా ?
మహానంది : దేవాదాయశాఖకు సమాచార హక్కు చట్టం వందశాతం వర్తిస్తుందని, ఆ శాఖ కూడా ఈ చట్టం పరిధిలోకే వస్తుందని ఉభయ రాష్ట్రాల సమాచార హక్కుచట్టం కమిషనర్ విజయబాబు అన్నారు. అయితే, చట్టాలను పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత పాలకులదేనన్నారు. మహానందీశ్వరుడి దర్శనార్థం శుక్రవారం సాయంత్రం ఆయన మహానందికి వచ్చారు. దేవస్థానం డిప్యూటీ కమిషనర్ శంకరవరప్రసాద్, ప్రోటోకాల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు వారికి స్వాగతం పలికారు. అనంతరం శ్రీకామేశ్వరీదేవీ సహిత మహానందీశ్వర స్వామివార్లను దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన తదితర ప్రత్యేకపూజలను నిర్వహించారు. అంతకు ముందు స్థానిక ఏపీ టూరిజం అతిథిగహం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేవాలయాల్లో హిందూ ధర్మాన్ని నిలబెట్టాలని, అలాగే భక్తుల మనో భావాలను పరిరక్షించాలని చెప్పారు. శ్రీశైలదేవస్థానంలో ఒక ఈఓ రూ. కోట్లలో ఆక్రమ ఆస్తులను కూడబెట్టుకోవడం, భక్తుల విరాళాలు మింగడం స.హ. చట్టం కిందికి వస్తుందన్నారు. ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్న లక్ష్యంతో కళాశాలలో, పలు ప్రాంతాలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. కర్నూలు జిల్లాలో 108 కేసుల విచారణ చేశామని, ఈ కేసులకు సంబంధించిన వివిధ స్థాయి అధికారులైన 32 మందికి షోకాజు నోటీసులు జారీ చేయడం, జరిమానాలు విధించడం జరిగిందన్నారు. ప్రభుత్వ శాఖలో ఏ ఒక్కరో అవినీతికి పాల్పడితే మొత్తం ఆ శాఖకే చెడ్డ పేరు వస్తుందన్నారు. ఆయన వెంట తహసీల్దార్ రామకష్ణుడు, వీఆర్వోలు సత్యనారాయణ, కష్ణనాయక్ పాల్గొన్నారు.
Advertisement