బెల్టుషాపులు ఎత్తివేయించండయ్యా..
-
జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డికి కలపాడు మహిళల వినతి
వెంకటగిరి: తమ జీవితాల పాలిట శాపంగా మారిన బెల్టుషాపులను ఎత్తివేయించమని కలపాడు ఎస్సీ కాలనీ మహిళలు జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డికి విన్నవించారు. స్థానికంగా శనివారం ఆయన గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. సరిగ్గా 50 కుటుంబాలు లేని తమ కాలనీలో మూడు బెల్టుషాపులు పెట్టి తమ భర్తల సంపాదన కొల్లగొడుతున్నారన్నారు. పోలీసులకో,సారాయి పోలీసులకో చెపితే వచ్చి లంచాలు తీసుకుంటున్నారో ఏమోగానీ... కాలనీలో మాత్రం మద్యం బెల్టుషాపు ఎత్తివేయడం లేదని వాపోయారు. వెంటనే స్పందించిన బొమ్మిరెడ్డి ఎక్సైజ్ సీఐ ద్వారకానాథ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. రెండు రోజుల్లో బెల్టుషాపులను తీయించకపోతే మహిళలే తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ జిల్లా సహాయ కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ, రైతు విభాగం కార్యదర్శి గూడూరు భాస్కర్‌రెడ్డి, వెంకటగిరి, డక్కిలి మండల కన్వీనర్లు ఆవుల గిరియాదవ్, రంగినేని రాజా, మాజీ ఎంపీపీ తాండవ రాజారెడ్డి ఉన్నారు.