అంతా..మాయ!
అంతా..మాయ!
Published Sat, Nov 12 2016 12:37 AM | Last Updated on Sat, Aug 11 2018 6:09 PM
- రంగస్థలంపై... రంజైన దృశ్యం...
– రంగస్థలంపై వర్షం, పున్నమి వెన్నెల
– సూర్యోదయం, పక్షుల విహారం
– యుద్ధాల్లో అస్త్రాల వింతలు
– మాయాబజార్ సినిమాకు ప్రామాణికం
– కర్నూలులో సురభి కళానైపుణ్యం
కర్నూలు(కల్చరల్) : ఘటోత్కచుడు వియ్యాల వారి విందుకు వచ్చి..తన చేతిని అలా ఊపగానే..అక్కడి లడ్డూలు, జిలేబీలు..జంతికలు అతని నోట్లోకి వెళ్లడం, పరచిన చాపలు, జంఖానాలు వాటంతట అవే చుట్టుకోవడం, మాయల పకీరు ఓం.. హ్రీం.. హరోం హర! అని మంత్రాలు పఠించగానే ఉన్న వస్తువులు మాయమై కొత్త వస్తువులు ప్రత్యక్షం కావడం., ఉన్నపళంగా వాన కురవడం.,తంబూరా వాయిస్తూ మేఘాల్లోంచి నారదుడు నేలకు దిగడం. ఇవన్నీ సినిమాల్లో అయితే మామూలే. కానీ రంగస్థలంపై.. ప్రేక్షకుల కళ్లెదుట ఈ దృశ్యాలు జరుగుతుంటే ఆశ్చర్యపోవాల్సిందే.
పౌరాణిక నాటకాల్లో దేవతలు ప్రత్యక్షం కావడం, యుద్ధంలో ఇరువైపుల నుంచి అస్త్రాలు ఢీ కొని మెరుపులు పుట్టడం చూస్తే ఆ అనుభూతే వేరు. వేదికపైకి నేరుగా గుర్రాలు, రథాలు రావడం, గాలిలో తేలియాడడం లాంటి దృశ్యాలు ఆవిష్కృతమవుతుంటే ప్రేక్షకులు ఊపిరి బిగపట్టుకొని చూడాల్సిందే. నిజమైన వినోదానికి ప్రతీకలైన ఇలాంటి దృశ్యాలు కేవలం సురభి వారి సొంతం. రంగస్థలంపైనే మంటలు రావడం, వాన కురవడం, సూర్యుడు అస్తమించడం, పక్షులు ఎగిరిపోవడం వంటి దృశ్యాల్లో పదుల కొద్దీ సాంకేతిక నిపుణులు పని చేస్తుంటే ఇలాంటివి ఆవిష్కృతమవుతాయి.
కడప నుంచి కర్నూలుకు..
'సురభి' పేరు తెలియని తెలుగువారు ఉండరు. తెలుగు పౌరాణిక నాటకానికి తమ సాంకేతిక నైపుణ్యంతో వినూత్న జవసత్వాలు తొడిగి ప్రేక్షకులను రంగస్థలం వైపుకు ఆకర్షించి కళారంగంలో విజయపతాక ఎగరేసిన సురభి నాటక సమాజం తెలుగు వారి సృజనాత్మకతకు నిదర్శనం. వైఎస్‌ఆర్ కడప జిల్లా సురభి గ్రామంలో మొగ్గ తొడిగిన ఈ కళానైపుణ్యం ఆంధ్ర దేశమంతా తన సుగంధాన్ని వెదజల్లింది. మూడు దశాబ్దాల క్రితం సురభి నుంచి కర్నూలు జిల్లాకు తరలివచ్చిన కళాకారుల కుటుంబం ఇక్కడ పౌరాణిక నాటకాలు ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం రోజారమణి అనే కళాకారిణి సురభి కుటుంబం నుంచి వచ్చి కర్నూలులో స్థిరపడి ఇప్పటికీ నాటకాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. రోజారమణి అక్క కుమారుడైన సురభి శంకర్ ప్రస్తుతం రాష్ట్ర ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో సాంకేతిక సలహాదారుగా వ్యవహరిస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా పౌరాణిక నాటకాలకు సాంకేతిక సహకారాన్ని అందిస్తూ రంగస్థలంపై మాయలు మంత్రాల ఎఫెక్ట్స్ సృష్టికి ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తున్నాడు. కర్నూలు లలిత కళాసమితి ప్రదర్శిస్తున్న పౌరాణిక నాటకాల్లో అద్భుతమైన వింతలకు ఈయనే రూపకర్త. 2013లో స్వర్ణ నంది సాధించిన 'బభ్రువాహన విజయం'లో వీరిది ప్రధాన పాత్ర.
‘మాయాబజార్’కు నడక నేర్పింది సురభియే...
1950 దశకంలో రాయలసీమకు చెందిన దర్శకుడు కె.వి.రెడ్డి రూపొందించిన మాయాబజార్ చిత్రంలో అద్భుతాలను ప్రవేశపెట్టే ముందు ఆయన సురభి నాటక సమాజాన్ని సంప్రదించారు. రంగస్థలంపై ఈ నాటక సమాజం ప్రదర్శిస్తున్న మాయలు, మంత్రాలు వాటి వెనక ఉండే సాంకేతిక నిపుణుల పనితనాన్ని ఆయన సమగ్రంగా పరిశీలించారు. మాయాబజార్ కథను జనరంజకంగా తెరకెక్కించేందుకు సురభి నైపుణ్యాలను ప్రామాణికంగా తీసుకున్నారు.
స్టేజీపై మంటలు.. వర్షం..
రంగస్థలంపై కొన్ని సందర్భాల్లో మంటలు చెలరేగే దృశ్యాలు ప్రదర్శించాల్సి వస్తుంది. పెట్రోలులో ముంచిన తాడును వేదికపై అమర్చి విద్యుత్ తీగలతో మధ్యలో ఫ్లాష్ వెలిగేటట్లు చేస్తే మంటలు చెలరేగుతాయి. ఇదంతా ప్రేక్షకుడికి తెలియకుండా, గమనించకుండా ఆకస్మికంగా మంటలు ఎగిసి వచ్చినట్లుగా ప్రదర్శిస్తారు. వర్షం ఎఫెక్ట్ కోసం తెర వెనుక ఒక పెద్ద క్యాన్‌లో నీరు పోసి ఉంచి సబ్ మెర్సిబుల్ మోటార్‌తో పైకి పంప్ చేస్తారు. ఈ నీరు రంధ్రాలున్న ఒక సన్నని పైపులోకి ప్రవహిస్తాయి. పైపు వెనక లైటింగ్ ఎఫెక్ట్ ఏర్పాటు చేస్తారు. మోటర్ ఆన్ చేయగానే వేదికపై సన్నని జల్లులు కురుస్తాయి.
గదలు, అస్త్రాలు ఢీ..
యుద్ధ రంగంలో గదలు, అస్త్రాలు ఢీకొనడం.. వెంటనే మెరుపులు పుట్టడం మనం పాత సినిమాల్లో చూశాం. సరిగ్గా ఇదే ఎఫెక్ట్‌ను రంగస్థలంపై చూస్తాం. దీని వెనుక అనేక దారాలు, కరెంటు తీగలు పనిచేస్తాయి.
ఆకాశం నుంచి దిగడం... భూమి మీద నుంచి పైకి రావడం...
నారదుడిని మేఘాల నుంచి కిందకు దింపేందుకు కనిపించని తాళ్లతో కట్టి కప్పీపై లాగుతూ, వదులుతూ దాదాపు పది మంది సాంకేతిక కళాకారులు పనిచేస్తారు. భూమని అకస్మాత్తుగా పైకి ఉబికి వచ్చినట్లు చూపిస్తారు. దీనికి స్టేజి కింది భాగం నుంచి ఆపరేట్ చేసే సాంకేతిక నిపుణులుంటారు.
వైఎస్సార్ చొరవతో సురభి కళాకారులకు బీసీ హోదా : సురభి శంకర్
జన హృదయ నేత అలనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి చొరవ వల్లే మా సురభి కళాకారులకు బీసీ హోదా సాధ్యమైంది. మేము ఎన్నో ఏళ్లుగా అసలు కులమే లేక అష్టకష్టాలు పడ్డాం. మా పూర్వీకులు మహారాష్ట్ర నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్‌లో స్థిరపడ్డారు. మాకు ఒక కులము లేదు. మా పిల్లలను పాఠశాలల్లో చేర్పించేటప్పుడు కులం పేరు రాయించడంలో చాలా ఇబ్బందిగా ఉండేది. ముప్పై ఏళ్లుగా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. అయితే వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి గారు 'సురభి నాటకాల వాళ్లు' అనే కులం కింద చేర్చి బీసీ–బీ హోదా ఇచ్చారు. దీంతో మాకు సమాజంలో గుర్తింపు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రుణాలు అన్నీ అందుకునే అవకాశం ఏర్పడింది.
కర్నూలు నుంచే నా విజయ ప్రస్థానం...
2000 దశకంలో కర్నూలు మున్సిపల్ పాఠశాలలో ప్రదర్శించిన 'పడమటి గాలి' సాంఘిక నాటకానికి నేను సాంకేతిక సహకారం అందించాను. రైతుల కడగండ్లను కళ్లకు కట్టినట్లుగా రూపొందించిన ఈ నాటకంలో సూర్యోదయం, సూర్యాస్తమయం, వర్ష బీభత్సంతో పంట నాశనం కావడం లాంటి దృశ్యాలు చాలా శ్రమకోర్చి చేశాను. దానితో నాకు మంచి పేరొచ్చింది. కర్నూలు టీజీవీ కళాక్షేత్రం స్టేజి డిజైనింగ్ కూడా మేమే చేశాం. రాష్ట్రంలో మూడు చోట్ల సురభి థియేటర్స్ ప్రత్యేక డిజైనింగ్ మేమే చేశాం.
Advertisement