గ్రామాల్లోకి వచ్చి ఆ మాటలు చెప్పండి
గ్రామాల్లోకి వచ్చి ఆ మాటలు చెప్పండి
Published Fri, Mar 10 2017 10:37 PM | Last Updated on Mon, Aug 13 2018 8:12 PM
ఎమ్మెల్యే బండారు ప్రకటనపై సీపీఎం ధ్వజం
నరసాపురం :
ఆక్వా పార్క్ నిర్మాణం వల్ల ఎలాంటి కాలుష్యం ఉండదని.. సీపీఎం, వైఎస్సార్ సీపీ నాయకులే తుందుర్రు పరిసర గ్రామాల ప్రజలను రెచ్చగొడుతున్నారని నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు చేసిన ప్రకటనపై సీపీఎం నిప్పులు చెరిగింది. సీపీఎం నాయకులు శుక్రవారం స్థానిక మీరా భవన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కె.రాజారామ్మోహన్‌రాయ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవనాయుడు తుందుర్రు పరిసర గ్రామాలకు వచ్చి నీతి సూత్రాలు చెబితే బాగుంటుందన్నారు. ఎవరో చెబితే రెచ్చిపోయే స్థితిలో జనం లేరన్న విషయం తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుసుకోవాలని హితవు పలికారు. మహిళా దినోత్సవం రోజున, మహిళలను పోలీసులు ఈడ్చుకెళితే.. ఎమ్మెల్యేగా కనీస కనికరం చూపించలేని వ్యక్తి ప్రజల కోసం పోరాడుతున్న ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పార్టీ డివిజన్ కమిటి సభ్యుడు కవురు పెద్దిరాజు మాట్లాడుతూ ఫ్యాక్టరీ కారణంగా కాలుష్యం ఏమాత్రం ఉండదని ఇప్పుడు చెబుతున్న మాధవనాయుడు గతంలో మొగల్తూరు మండలం కొత్తోట గ్రామంలో నిర్వహించిన సభలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యాక్టరీని కట్టనిచ్చేది లేదని ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. ఆయన మనసు మారడానికి కారణం ఏమిటో చెప్పాలన్నారు. పార్టీ పట్టణ కార్యదర్శి ఎం.త్రిమూర్తులు మాట్లాడుతూ ఈనెల 14న రాష్ట్రస్థాయి అఖిలపక్ష పార్టీల నాయకులు తుందుర్రు పరిసర గ్రామాల్లో పర్యటిస్తారని చెప్పారు. సమావేశంలో పార్టీ నేతలు పొగాకు పూర్ణ, పూరిళ్ల శ్రీనివాస్, పొగాకు నారాయణరావు, పొన్నాడ రాము, ఎం.రామాంజనేయులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement