బంగారు నాణేలంటూ... భలే మోసం! | fake Gold coins gang arrested | Sakshi
Sakshi News home page

బంగారు నాణేలంటూ... భలే మోసం!

Published Sat, Mar 26 2016 4:01 PM | Last Updated on Thu, Jul 26 2018 1:42 PM

బంగారు నాణేలంటూ... భలే మోసం! - Sakshi

బంగారు నాణేలంటూ... భలే మోసం!

  • అంతర్ రాష్ట్ర ముఠాలోని ముగ్గురి అరెస్ట్       
  • నకిలీ నాణేలు, నగదు, బైక్ స్వాధీనం
  • బాగేపల్లి :
    నకిలీ బంగారు నాణేలతో వంచనకు పాల్పడుతున్న అంతర్‌రాష్ట్ర ముఠాలోని ముగ్గురు సభ్యులు బాగేపల్లి పోలీసులకు పట్టుబడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోని కదిరి పట్టణానికి చెందిన కేశవ, కర్ణాటకలోని చింతామణి తాలూకాలోని బురుడుగుంటె గ్రామానికి చెందిన సుధాకర్, శిడ్లఘట్ట తాలూకాలోని బుశెట్టి హళ్లి గ్రామానికి చెందిన సంతోష్‌ను శుక్రవారం అరెస్ట్ చేసిన పోలీసులు..వారి నుంచి నకిలీ నాణేలు, బైక్, రూ.5వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు..కర్నూల్ పట్టణానికి చెందిన గోవింద 2015 సెప్టెంబర్ 10న కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లారు. ఆ సమయంలో ఓ జంట వారికి పరిచమైంది. తనపేరు ప్రసాద్ అని, భార్యతో కలిసి తిరుమలకు రాగా పర్సు పొయిందని, రూ.500 సహాయం చేయాలని కోరారు. ఈ మేరకు వారితో డబ్బు తీసుకొని 9052721854 సెల్‌ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్లారు.

    అదే నెల 13న ప్రసాద్.. గోవిందుకు ఫోన్ చేశాడు. తమ అత్త ఇంటిని పునర్ నిర్మిస్తుండగా  4.5 కిలోల బంగారు నాణేలు లభించాయని, రూ. 15 లక్షలు ఇస్తే వాటిని ముట్టచెబుతామని ఆశ పెట్టారు.మరుసటి రోజు గోవిందకు ఫోన్ చేసి కదిరికి పిలిపించారు. అసలైన బంగారు నాణేం గోవిందుకు ఇచ్చి రూ.14 వేలు ఇప్పించుకున్నారు. ఈ నాణేన్ని పరిశీలించుకోవాలని, మీకు అంగీకారమైతే మొత్తం బంగారం ఇస్తామని తెలిపారు. 16, 17 తేదీల్లో ప్రసాద్, రామచంద్రారెడ్డి గోవిందకు ఫోన్ చేశారు. నాణేలు సిద్ధంగా ఉన్నాయని, డబ్బు తీసుకొని వస్తే అప్పగిస్తామన్నారు. 20వ తేదీన గోవింద వారికి ఫోన్ చేసి తన వద్ద  11.50 లక్షలు మాత్రం ఉన్నాయని చెప్పడంతో ఆ మొత్తాన్ని ధర్మవరానికి తీసుకురావాలని సూచించారు. దీంతో గోవింద ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను ముత్తూట్ పైనాన్స్‌లో తాకట్టు పెట్టి రూ.11.50 లక్షలు తీసుకున్నాడు. అందులోనుంచి రూ. 7 లక్షలు తీసుకొని ధర్మవరం వెళ్లాడు. అక్కడ ఉన్న దుండగులు ఆ మొత్తాన్ని తీసుకున్నారు.

    మిగతా డబ్బు బాగేపల్లి సమీపంలోని గోళూరు వద్ద ఉన్న వ్యక్తులకు ఇస్తే  బంగారు నాణేలు ఇస్తారని చెప్పి పంపారు. గోవింద అదేరోజు మరో రూ.4.50 లక్షలు తీసుకొని గోళూరు వద్దకు వెళ్లాడు. అతను నగదు ఇస్తుండగా పథకం ప్రకారంపోలీసు వేషాల్లో ఉన్న దుండగులు ఆ డబ్బు, నకిలీ నాణేలతో ఉడాయించారు. తాను మోసపోయినట్లు తెలుసుకున్న గోవింద బాగేపల్లి  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు గాలింపు చేపట్టి కేశవ, సుధాకర్, సంతోష్‌ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టగా ప్రధాన నిందితుడు మృతి చెందినట్లు తేలింది. ఈ ముఠాలో మంజు, నరసింహ, బాషాలు ఉన్నట్లు నిందితులు వెల్లడించారని, వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులనుంచి నకిలీ బంగారు నాణేలు, బైక్, నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement