కర్నూలు : పంట రుణం భారం అయింది. రుణం తీర్చే మార్గం లేక కౌలుకు తీసుకున్న చేనులోనే ఓ పత్తి రైతు ప్రాణం తీసుకున్నాడు. కర్నూలు జిల్లా గడివేములలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సై రామాంజనేయరెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం... గడివేముల మండల కేంద్రానికి చెందిన దూదేకుల ఇస్మాయిల్ (55) తన రెండున్నర ఎకరాలతోపాటు మరో ఎకరంన్నర కౌలుకు తీసుకుని మూడేళ్లుగా పత్తి సాగు చేస్తున్నాడు.
పంట సరిగా చేతికి రాక రూ.4 లక్షల వరకు అప్పు మిగిలింది. ఈ ఏడాది పత్తి పైరు సరిగా లేకపోవటంతో తీవ్ర మనోవేదన చెందాడు. కౌలుకు తీసుకున్న చేనులోనే చెట్టుకు ఉరి వేసుకున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రైతు ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.