మెదక్ జిల్లా కొల్చారం మండలం ఏటిగడ్డ మాందాపూర్‌లో ఓ రైతు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కొల్చారం: మెదక్ జిల్లా కొల్చారం మండలం ఏటిగడ్డ మాందాపూర్‌లో ఓ రైతు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బర్దిపురం మల్లేశం(45)కు గ్రామంలో మూడెకరాల పొలం ఉంది. గత ఏడాది పొలంలో ఉన్న బోరు ఎండిపోవడంతో పంట సాగుచేయలేదు. అప్పటికే ఇద్దరు కూతుళ్ల పెళ్లి కోసం రూ.4 లక్షల వరకు అప్పు చేయాల్సి వచ్చింది.
ఈ క్రమంలో అప్పు తీర్చేందుకు తన పొలాన్ని అమ్మేందుకు మల్లేశం సిద్ధపడ్డాడు. అయితే, రుణ దాత ఒకరు తను చెప్పిన వారికి మాత్రమే పొలాన్ని అమ్మాలంటూ తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన మల్లేశం తిరిగిరాలేదు. గురువారం ఉదయం గ్రామానికి చెందిన నారాయణరెడ్డి పొలంలోని గుడిసెలో ఉరి వేసుకొని కనిపించాడు. మల్లేశం భార్య ఫిర్యాదు మేరకు కొల్చారం ఎస్సై రమేష్ నాయక్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.