నకిలీ విత్తనాలతో నట్టేట మునిగాం
-
శ్రీ ఇందిరా సీడ్స్ ఎదుట రైతుల అందోళన
-
పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు సిద్ధపడిన రైతు
నెల్లూరు(పొగతోట):
నకిలీ విత్తనాలతో నట్టేట మునిగామని, తమకు నష్టపరిహారం మంజూరు చేయాలని బుధవారం బోసుబొమ్మ సెంటర్ వద్ద ఉన్న శ్రీ ఇందిరా సీడ్స్ ఎదుట రైతులు అందోళనకు దిగారు. ముత్తుకూరుకు చెందిన వివేకానందరెడ్డి అనే రైతు పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. రైతులు అడ్డుకోవడంతో విరమించుకున్నాడు. ఈ సందర్భంగా వివేకానందరెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, శరత్‌బాబు, పెంచలనాయుడు తదితర రైతులు ఇందిరా సీడ్స్ వద్ద విత్తనాలు కొనుగోలు చేసి వరి పంటలు సాగు చేశామని, మీనాక్షి, 555 రకాలు సాగు చేశారు. పంట వేసి నాలుగు నెలలైనా వెన్నుతీయలేదన్నారు. ఎకరాకు రూ.30 వేలు పెట్టుబడి పెట్టామని, పంట ఏపుగా పెరిగినా వెన్నుతీయలేదన్నారు. ఎకరాకు రూ.20 నుంచి రూ.25 వేల వరకు నష్టపరిహారం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పరిహారం చెల్లించకపోతే నిరాహారదీక్ష చేపడతామని హెచ్చరించారు. ఇందిరా సీడ్స్ యాజమాని రైతులతో చర్చించి పంటలను పరిశీలించారు. నాలుగు రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం.