ఏమార్చే యత్నం ! | fertilisers scham in anantapur | Sakshi
Sakshi News home page

ఏమార్చే యత్నం !

Published Sun, Jul 17 2016 9:31 PM | Last Updated on Mon, Oct 1 2018 6:38 PM

fertilisers scham in anantapur

సాక్షిప్రతినిధి, అనంతపురం: ఎరువుల కుంభకోణంలో సూత్రదారులైన ఇద్దరు అధికారులను తప్పించేలా విచారణ సాగుతోందా..? వ్యవసాయాధికారులతో పాటు మిక్సింగ్‌ప్లాంటుపై ఎలాంటి చర్యలు లేకుండా చూడాలని ఓ ముఖ్య ప్రజాప్రతినిధి చేసిన ఆదేశాలను విచారణ అధికారులు పాటిస్తున్నారా...? తాజా పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వస్తోంది. ఎరువుల కుంభకోణంలో మార్క్‌ఫెడ్‌కు వెళ్లాల్సిన 50 శాతం ఎరువులు భాస్కర్‌ ఫర్టిలైజర్స్‌కు వెళ్లినట్లు తేలింది. ఈ ఎరువులను అధికారులు సీజ్‌ చేశారు.  వాస్తవానికి కలెక్టర్, జేడీ, ఏడీ పీపీ కనుసన్నల్లో ఎరువుల కేటాయింపులు జరగాలి. ‘సాక్షి’లో కథనాలు వచ్చే వరకూ భాస్కర్‌ఫర్టిలైజర్స్‌ వైపు అధికారులు కన్నెత్తి చూడలేదు.
 
 
దీన్నిబట్టే అధికారుల ప్రమేయంతోనే ఎరువులు ప్లాంటుకు చేరినట్లు తెలుస్తోంది. ఈ నెల 10వ తేదిన వచ్చిన రేక్‌లోని ఎరువులను కూడా ప్లాంటుకు తరలించినట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే ‘సాక్షి’లో ‘దారితప్పిన ఎరువులు’ శీర్షికతో కథనం ప్రచురితం కావడంతో అదేరోజు మధ్యాహ్నం లోపు ఎరువులను ‘సెంట్రల్‌వేర్‌హౌస్‌’ గోడౌన్‌ తరలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలన్నీ బట్టి చూస్తే వ్యవసాయధికారులే  1,300 టన్నుల ఎరువులను దారి మళ్లించారని తెలుస్తోంది.  ఈ ఘటనకు ఎరువుల పర్యవేక్షణ చూసే అధికారులు బాధ్యత వహించాలి. అయితే వీరిని తప్పించేందుకు ఇప్పుడు కథ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ‘మార్క్‌ఫెడ్‌’ అధికారులు వద్దన్నారు కాబట్టే ఎరువులు ప్లాంటుకు పంపామని కథ అల్లుతున్నట్లు తెలుస్తోంది.  
 
 
ఇందులో మార్క్‌ఫెడ్‌తో పాటు,  రేక్‌ ఆఫీసర్‌ పాత్రను తెరపైకి తెచ్చారు. వాస్తవానికి రేక్‌ ఆఫీసర్‌ అనే పోస్టు లేదు. లోకల్‌ ఏఓ లేదా ఏడీని నామినేట్‌ చేయాలి. ప్రస్తుతం ఏఓగా వాసుప్రకాశ్, రవి ఏడీఏగా ఏడాదిన్నరగా కొనసాగుతున్నారు. ఈ ఇద్దరిలో ఎవ్వరినీ రేక్‌ ఆఫీసర్‌గా నామినేట్‌ చేయలేదు. ఎరువులను జేడీఏ కార్యాలయ అధికారులే పర్యవేక్షిస్తున్నారు. అంటే వేల టన్నుల ఎరువులు రైల్వేస్టేçÙన్‌కు వస్తుంటే అవి ఎవరికి పంపాలి..? కేటాయింపులు ఎవరు చూడాలి..? బాధ్యత ఎవరిదనేది లే కుండా ఇంత కాలం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో తెలుస్తోంది. భాస్కర్‌ ఫర్టిలైజర్స్‌కు కేటాయింపులు కీలక అధికారుల కనుసన్నల్లో జరగడం, విషయం బయటకు పొక్కడంతో బాధ్యులని తప్పించేందుకు విషయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని తెలుస్తోంది.  కలెక్టర్‌ నిస్పాక్షికంగా విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తీసుకొచ్చి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement