నకిలీ శాపం
– ఎరువులు, కాంప్లెక్స్‌ల్లో భారీ మోసం
– నకిలీవి అంటగట్టిన వ్యాపారి
– 300 ఎకరాల్లో మిరప.. 200 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్న వైనం
– లబోదిబోమంటున్న అన్నదాతలు
పెట్టుబడుల కోసం వేలాది రూపాయలు అప్పులు చేసి మరీ పంటలు సాగు చేస్తున్న రైతులను నకిలీ ఎరువులు నట్టేట ముంచుతున్నాయి. పంట ఎదుగుదల లేకపోవడంతో వారికి ఏం చేయాలో దిక్కుతో^è డం లేదు. ఓ ఫర్టిలైజర్ యజమాని నిర్లక్ష్యంతో యర్రగుంటలో రైతుల బతుకులు ఛిద్రం అయ్యాయి.
కణేకల్లు : మండలంలోని యరగ్రుంటలో రైతులు మిరప, వరి పంట సాగు చేశారు. పంట ఎదుగుదల, దిగుబడి కోసం స్థానికంగా ఉన్న ఓ ఫర్టిలైజర్ దుకాణంలో రైతులు కాంప్లెక్స్‌లు, ఎరువులు కొనుగోలు చేశారు. వారం క్రితం రైతులు మిరప పంటకు కాంప్లెక్స్‌లను వేశారు. భూమిలో కాంప్లెక్స్ వేసిన తర్వాత ఒక రోజులో అదంతా కరిగిపోవాలి. గాలి, భూమిలో ఉన్న తేమకు కరిగిపోయే గుణం కాంప్లెక్స్ ఉంటుంది. అయితే వారం తర్వాత కూడా కాంప్లెక్స్ కరిగకపోగా మిరప పంట పసుపు పచ్చరంగులోకి మారుతుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.
నకిలీ కాంప్లెక్స్‌లు కావడంతో అవి కరగకుండా ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. వరి పంట బలం, దిగుబడి కోసం పలువురు రైతులు డీఏపీ, కాంప్లెక్స్‌లు, యూరియాలు వాడినా ఫలితం కన్పించకపోవడంతో ఇవన్నీ నకిలీవేనని రైతులు వాపోతున్నారు. మిరప, వరినాట్లు వేసినప్పటి నుండి ఇప్పటి వరకు రైతులు లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టారు. పంట కాపు దశకు వచ్చిన సమయంలో ఎదుగుదల లేక పోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. స్థానిక ఫర్టిలైజర్ యజమానిపై రైతులు మండిపడుతున్నారు.
ఆత్మహత్య తప్ప మరోమార్గం లేదు
నాకు 6 ఎకరాల భూమి ఉంది. నాలుగు నెలల క్రితం మిర్చి పంట వేశాను. వారం క్రితం స్థానికం ఫర్టిలైజర్ షాపులో కాంప్లెక్స్‌లు తీసుకొని పంటకు వేశాను. ఉన్నట్టుండి పంట ఎదుగుదల ఆగిపోయింది. పూత కూడా రాలేదు. ఇప్పటి వరకు ఎకరానికి రూ.40 వేల వరకు పెట్టుబడులు పెట్టాను. అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు. ఆత్మహత్య తప్ప మరో మార్గం కన్పించడం లేదు. నకిలీ కాంప్లెక్స్‌ల గురించి సదరు యజమానిని నిలదిస్తే నా మర్యాద పోతోంది ఎవరికీ చెప్పుద్దంటూ నాలుగు కాంప్లెక్స్ బస్తాలిచ్చి పంపాడు.
– లక్ష్మన్న, బాధిత రైతు
వరికి కంకి రాలేదు
28 ఎకరాల్లో డీఏపీ, కాంప్లెక్స్, యూరియా మొత్తం 250 బస్తాలు వాడాను. వరి పంట పెట్టి 3 నెలలైంది. పంట బలంగా ఉండి మేలైన దిగుబడి వస్తుందని ఎరువులు వాడాను. నేటికీ వరికి కంకి రాలేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అధికారులు స్పందించి పంటలను పరిశీలించి న్యాయం జరిగేలా చూడాలి.
– పి.రామచంద్రారెడ్డి , రైతు, యర్రగుంట
పంటలను పరిశీలిస్తాం
కాంప్లెక్స్, ఎరువులు, యూరియా వాడి దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తాం. సంబంధిత డీలర్ షాపుకెళ్లి స్టాక్ ఎక్కడి నుండి తెప్పించాడు ? ఎప్పుడు వచ్చింది ఇన్‌వాయిస్ బిల్లులతో సహా పరిశీలిస్తాం. నిల్వ ఉన్న స్టాక్ నుండి శ్యాంపిల్ తీసి ల్యాబ్‌కు పంపుతాం.
– మద్దిలేటి, ఏడీఏ , రాయదుర్గం