వణుకుతున్న ‘తూర్పు’ | fever in eastgodavari | Sakshi
Sakshi News home page

వణుకుతున్న ‘తూర్పు’

Published Sun, Sep 18 2016 10:33 PM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM

వణుకుతున్న ‘తూర్పు’

వణుకుతున్న ‘తూర్పు’

  • జిల్లావ్యాప్తంగా విషజ్వరాలు
  • ప్రబలుతున్న డెంగీ
  • మలేరియాతో ఏజెన్సీ గజగజ.. పలువురి మృత్యువాత
  • ఆస్పత్రులకు క్యూ కడుతున్న బాధితులు
  • పట్టణాలు, పల్లెల్లో పారిశుధ్యలేమి
  • నామమాత్రంగా నియంత్రణ చర్యలు
  •  
    సాక్షి, రాజమహేంద్రవరం :
    జ్వరాలతో జిల్లా వణుకుతోంది. పట్టణం, గ్రామం అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో ప్రాణాంతక జ్వరాలు ప్రబలుతున్నాయి. డెంగీ, విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. మలేరియా, ఇతర అంతుచిక్కని వ్యాధులతో అడవితల్లి బిడ్డలు తల్లడిల్లుతున్నారు. ఇంకా టైఫాయిడ్, వైరల్‌ జ్వరాలు కూడా వ్యాపిస్తున్నాయి. దీంతో, బాధితులు వందలాదిగా ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు.
    • చిన్నపిల్లల ఆస్పత్రుల్లో నమోదయ్యే ఓపీలో 70 శాతం జ్వరం కేసులే ఉంటున్నాయి.
    • ఇప్పటివరకూ జిల్లాలో 113 డెంగీ కేసులు నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. కానీ ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
    • డెంగీ అనుమానిత జ్వరాలతో వందల మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతున్నారు.  రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోతూండడంతో ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఆస్పత్రుల్లో చేసే కార్డ్‌ టెస్ట్‌ల్లో డెంగీ లేకపోయినా పాజిటివ్‌ వస్తోంది. దీంతో బాధితులు ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతూ వేలల్లో ఫీజులు చెల్లించుకుంటున్నారు.
    • రామచంద్రపురం పట్టణంలోని స్టిల్‌విల్‌పేటలో ఏకంగా 200 మంది జ్వరాల బారిన పడ్డారు.
    • ఏజెన్సీలో మలేరియాతో ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఆగస్టు నెల వరకూ ఏజెన్సీలోని 26 పీహెచ్‌సీల పరిధిలో మలేరియా పాజిటివ్‌ కేసులు 4,496 నమోదయ్యాయి. దోమల  నియంత్రణ  చర్యల్లో జాప్యం జరగడంతో గత ఏడాదికన్నా ఎక్కువమంది మలేరియా బారిన పడ్డారు.
    • రక్త పరీక్షలు చేయడంవల్లే అధిక కేసులు నమోదయ్యాయని ఇటీవల ఏజెన్సీలో పర్యటించిన గిరిజన సంక్షేమ మంత్రి రావెల కిషోర్‌బాబు రాజమహేద్రవరంలో జరిగిన సమీక్షలో అనడంతో అధికారులే అవాక్కయ్యారు.
    తూతూమంత్రంగా చర్యలు
    గ్రామాల్లో డ్రైనేజీలు లేక మురుగునీరు ఎక్కడికక్కడ నిలిచిపోతోంది. ఉన్న డ్రైనేజీలు శిథిలమై మురుగునీరు నిలిచిపోయి దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారుతున్నాయి. వీటిని ఆధునికీకరించి, దోమల నివారణ మందులు చల్లే ప్రక్రియను అధికార యంత్రాంగం నామమాత్రంగా చేస్తోంది. దీంతో గ్రామాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంటోంది. పట్టణాల్లో కూడా చాలాచోట్ల దాదాపు ఇదే పరిస్థితి ఉంది. లార్వా దశలోనే దోమలను నిర్మూలించాల్సిన ప్రజారోగ్య శాఖ చోద్యం చూస్తోంది. దీంతో దోమల ఉత్పత్తి పెరిగిపోతోంది.
    డెంగీ వచ్చేదిలా..
    డెంగీ జ్వరం ఏడిస్‌ ఈజిపై్ట అనే దోమ వల్ల వస్తుంది. ఈ దోమ మంచినీటిని ఆవాసంగా చేసుకుని వృద్ధి చెందుతుంది. ఇళ్లలోని ఫ్రిజ్‌లు, వంటగదులు, చీకటి ప్రదేశాలు, ఖాళీ టైర్లు, తాగి పారేసిన కొబ్బరి బొండాల్లో ఉన్న నీటిలో ఇది పెరుగుతుంది. ఈ దోమ కుట్టడంవల్ల డెంగీతోపాటు చికన్‌గున్యా జ్వరాలు వస్తాయి. పచ్చని చెట్ల వద్ద ఉండే తోక పురుగుల వల్ల కూడా డెంగీ వస్తుంది. ఇంటిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, మంచినీటిని ఏ పూటకు ఆ పూట పట్టుకోవడంవల్ల డెంగీ కారక దోమల వృద్ధిని నియంత్రించవచ్చు.
     
    జ్వరాలున్నది నిజమే..
    జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో డెంగీ, విషజ్వరాలు అధికంగా ఉన్నాయి. జ్వరపీడితుల కోసం సోమవారం నుంచి నెల రోజులపాటు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. మొబైల్‌ మలేరియా అండ్‌ డెంగీ క్లినిక్‌ (ఎంఎం అండ్‌ డీసీ) ప్రవేశపెడుతున్నాం. ఈ మొబైల్‌ బృందంలో డాక్టర్‌తోపాటు ఐదుగురు సిబ్బంది ఉంటారు. వీరు ప్రతి ఇంటికీ వెళ్లి జ్వరం ఉన్నవారికి పరీక్షలు చేస్తారు. సాధారణ జ్వరం అయితే మందు రాసిస్తారు. లేదంటే ఆస్పత్రికి పంపిస్తారు. గ్రామాల్లో ఏఎన్‌ఎంకు సహాయంగా మరో మేల్‌ ఏఎన్‌ఎంను పంపిస్తున్నాం. వీరు గ్రామంలో జ్వరంతో బాధపడుతున్నవారికి పరీక్షలు చేస్తారు. అవసరమైతే ప్రభుత్వాస్పత్రులకు పంపిస్తారు.
    మాక్‌ ఎలిసా టెస్ట్‌తోనే డెంగీ నిర్ధారణ
    కార్డ్‌ టెస్ట్‌లో పాజిటివ్‌ వచ్చినా డెంగీ కాదు. మాక్‌ ఎలిసా టెస్ట్‌తోనే డెంగీ నిర్ధారణ సాధ్యం. కార్డ్‌ టెస్ట్‌లు చేసేందుకు అవసరమైన కిట్లు అన్ని ప్రభుత్వాస్పత్రుల్లోనూ, గ్రామాల్లో ఏఎన్‌ఎంల వద్ద అందుబాటులో ఉన్నాయి.
    – కె.చంద్రయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి
     
    జ్వరాలబారిన స్టిల్‌వెల్‌పేట
    రామచంద్రపురం :
    పురపాలక పరిధిలోని 2వ వార్డు స్టిల్‌విల్‌పేటలో విషజ్వరాలు విజృంభించాయి. గత వారం, పది రోజుల్లో ఒక్క ఈ ప్రాంతంలోనే సుమారు 200 మంది జ్వరాల బారిన పడినట్టు స్థానికులు చెప్పారు. కాలనీలోని దాదాపు ప్రతి ఇంట్లో ఒకరు జ్వరాలతో బాధపడుతున్నారు. పది రోజులుగా కాలనీలో ఇదే పరిస్థితులు కొనసాగుతున్నా అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు. కాలనీకి చెందిన దొమ్మలపాటి ఐశ్వర్య అనే ఏడేళ్ల చిన్నారికి పేట్లెట్స్‌ పడిపోయి డెంగీ బారిన పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఆచిన్నారిని మండపేటలో గల ఒక ప్రవేటు ఆస్పత్రిలో తల్లిదండ్రులు చికిత్సను చేయిస్తున్నట్లు కాలనీవాసులు చెబుతున్నారు. నడిగట్ల భవాని అనే గర్భిణి కూడా జ్వరం బారిన పడింది. దొమ్మలపాటి కమల తీవ్ర జ్వరంతో ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. రాజగోపాల్‌ సెంటర్‌కు చెందిన ఎం.సత్యవేణి గత మంగళవారం నుంచి జ్వరంతో బాధపడుతూండగా శనివారం ఆస్పత్రిలో చేరింది. తీవ్రజ్వరంతో బాధ పడుతూ 20 మంది వరకూ ఏరియా ఆస్పత్రిలో చేరారు. ఇటీవల ప్రతి రోజూ ఓపీలో సుమారు 50 వరకూ జ్వరం కేసులు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. పరిస్థితి తీవ్రతను స్టిల్‌విల్‌పేట వాసులు మున్సిపల్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా పారిశుద్ధ్య పనులు చేపట్టి చేతులు దులుపుకొన్నారు. ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయలేదు. పట్టణంలోని రాజబాబు నగర్, అషియల్‌ కాలనీ, రాజగోపాల్‌ సెంటర్, జల్లిపేట, గుబ్బలవారిపేట, బంగ్లాతోట, కమ్మవారిసావరం తదితర ప్రాంతాల్లో కూడా అధిక సంఖ్యలో ప్రజలు జ్వరాలతో అల్లాడుతున్నారు. అధికారులు వెంటనే ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, జ్వరాల వ్యాప్తిని అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.  
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement