అసమానతలపై ఉద్యమిద్దాం
ఆదోని అర్బన్: విద్యా సంస్థలో పెరిగిపోతున్న అసమానతలు, వివక్షతకు వ్యతిరేకంగా విద్యార్థులు సంఘటితంగా ఉద్యమించాలని రాయలసీమ ఉద్యమ నేత భూమన్ పిలుపు ఇచ్చారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో రెండో రోజు శనివారం జరిగిన పీడీఎస్‌యూ జిల్లా నాలుగో మహాసభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సమాజంలో వేళ్లూనుకున్న అసమానత, వివక్షత విద్యాసంస్థల్లో కూడా కొనసాగుతున్నందున ఎంతో మంది విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. విద్యా రంగం, సాగు నీటి ప్రాజెక్టుల ఏర్పాటుపై అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడంతో సీమ జిల్లాలను సమీప భవిష్యత్తులోనే కరువు కాటకాలు కబళించే ప్రమాదం పొంచి ఉందన్నారు. విద్యా సంస్థలపై కూడా ఈ ప్రభావం పడుతోందని తెలిపారు. సీమ జిల్లాలకు కేటాయించిన జాతీయ విద్యా సంస్థలను వెంటనే మంజూరు చేయాలనే డిమాండ్‌తో ఉద్యమించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరారు. కార్యక్రమంలో ఏపీ విద్య పరిరక్షణ కమిటీ కన్వీనర్ రమేష్ పట్నాయక్, పీడీఎస్‌యూ నాయకులు రవిచంద్ర, రామ్‌మోహన్, భాస్కర్, మల్లికార్జున, మణి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కార్యవర్గం ఎన్నిక
పీడీఎస్‌యూ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా శేఖర్ నాయుడు, ప్రధాన కార్యదర్శిగా భాస్కర్, ఉపాధ్యక్షుడిగా నరేష్ ఆచారి, రఫిక్, సహాయ కార్యదర్శులుగా మల్లికార్జున, రమణ, వెంకటేష్, కోశాధికారిగా సునీల్ ఎన్నిక అయ్యారు.