సాక్షి, రంగారెడ్డి జిల్లా: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి కొండా రాఘవ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలో అన్ని మండల, నియోజవర్గ కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. బుధవారం లోటస్‌పాండ్‌లో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాఘవరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు త్రీవ సంకట స్థితిని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రబీ సీజన్ అదును దాటుతున్నా.. ఇంతవరకు పంట రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు ముఖం చాటేస్తున్నారని చెప్పారు. దీంతో పెట్టుబడులేక పంటసాగు ఎలా చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఈనెల 21న వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
షాద్‌నగర్ పట్టణం కేంద్రంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. రక్తదాన శిబిరాల ఏర్పాటు, అన్నదానం, దుస్తుల పంపిణీ తదితర సేవాకార్యక్రమాలు జిల్లావ్యాప్తంగా చేస్తామన్నారు. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడాలని సమావేశంలో తీర్మానించారు. జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీని బలోపేతం కావడానికి శాయశక్తులా కృషిచేస్తానని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ సేవాదళ్ అధ్యక్షులు బండారు వెంకట రమణ, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అమృతసాగర్, యువజన విభాగం అధ్యక్షులు వి. రామ్మోహన్, మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీ ఇబ్రహీం, రాష్ట్ర కార్యదర్శి పాప వెంకట్‌రెడ్డి, రమారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు, మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలపై పోరాటం
Published Thu, Dec 15 2016 4:17 AM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
Advertisement