గోపాల మిత్రల గోడు పట్టదా..?
♦ పట్టించుకోని ప్రభుత్వం
♦ రూ.2 వేల జీతంతో ఆర్థిక ఇబ్బందులు
♦ ఏళ్ల తరబడి వెట్టిచాకిరీ చేస్తున్న గోపాలమిత్రలు
నిడదవోలు: గోపాలమిత్రల బతుకులు దుర్భరంగా మారాయి. ఏళ్ల తరబడి వెట్టి చాకిరీ చేస్తున్నా అందేది అంతంత మాత్రం వేతనమే.. ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తున్నా వేతనాలు పెంచడం లేదని గోపాలమిత్రలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశు వైద్యాధికారికి, రైతుకు అనుసంధానకర్తగా పశుగణాభివృద్ధి సంస్థలో జిల్లా వ్యాప్తంగా 180 మంది గోపాలమిత్రలు పనిచేస్తున్నారు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ గ్రామగ్రామాన తిరుగుతూ పాడి పరిశ్రమ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారు.
అరకొర వేతనాలు
రైతుల ఇళ్ల వద్దకే వెళ్లి పశువులకు వైద్యం అందించడం వీరి ప్రధాన బాధ్యత. అయితే వీరు ఇంత చాకిరీ చేస్తున్నా అరకొర వేతనాలే అందుతున్నాయి. చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణ భారమవుతోందని గోపాలమిత్రలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశుసంపద పెంచడానికి కృషి చేసేందుకు ‘రైతుల ముంగిటకే వైద్యం’ అనే నినాదంతో 2000 సంవత్సరంలో గోపాలమిత్రలను ప్రభుత్వం నియమించింది. వీరికి నెలకు రూ.2000 వేతనం ఇస్తున్నారు. ఇచ్చిన టార్గెట్ పూర్తి చేస్తే అదనంగా మరో రూ.1500 చెల్లిస్తారు. లేదంటే గౌరవ వేతనం మాత్రమే అందుతుంది.
విధులు
⇔ రైతులకు పశుగ్రాసం, మేతపై అవగాహన కల్పించడం
⇔ పశువైద్యాధికారి సహకారంతో గ్రామాల్లో గర్భకోçశ వ్యాధులపై చికిత్స శిబిరాలు, పశు విజ్ఞాన సదస్సులు నిర్వహించడం
⇔ రైతుల ఇళ్లకు వెళ్లి పశువులకు కృత్రిమ గర్భధారణ ఇంజక్షన్‌లు చేయడం
⇔ కృత్రిమ గర్భధారణ పద్ధతులను ప్రోత్సహించి మేలు జాతి పశుసంతతిని అభివృద్ధి పర్చడం
⇔ పశువులకు బీమా చేయించడం
ఇవీ డిమాండ్లు..
⇔ పశుసంవర్ధకశాఖలో గోపాలమిత్రలను వీఏలుగా నియమిస్తామనే ప్రభుత్వ హామీని నెరవేర్చడం
⇔ పశువైద్యశాలలో గోపాలమిత్రలకు 50 శాతం కోటా కల్పించి, కార్యాలయ సబార్డినేట్లుగా నియమించడం
⇔ కనీస వేతనం రూ.13,500 కల్పించడం
⇔ ప్రమాదంలో మరణించిన వారికి రూ. 5 లక్షల ప్రమాద బీమా చెల్లింపు
⇔ పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం ∙రవాణా చార్జీల చెల్లింపు