చదువు‘కొనాల్సిందే’
పట్టణంలో పేదోడికి చదువు భారమవుతోంది. సర్కారు బడులు లేక తప్పనిసరిగా ప్రైవేటు బడుల్లో చేరాల్సివస్తోంది. ఏనాడో ఉన్న పాఠశాలల్నే నేటికీ కొనసాగిస్తూ... పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పెంచకపోవడంతో ఉన్న పాఠశాలలనే అంతా ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా ఆ పాఠశాలల్లో ప్రతీ తరగతిలోనూ పరిమితికి మించి విద్యార్థులుంటున్నారు. సర్కారు చదువులు ప్రోత్సహించాలని చెబుతున్న పాలకులు పాఠశాలలను పెంచడంలో శ్రద్ధ చూపకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
* పట్టణాల్లో పెరగని సర్కారు బడులు
* పేదోడి చదువుకు తప్పని ఆర్థిక భారం
* తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు స్కూళ్లే దిక్కు
* పరోక్షంగా ప్రైవేటుకు ప్రోత్సాహం
విజయనగరం అర్బన్: మున్సిపల్ పాఠశాలల్లో ఐఐటీ ఫౌండేషన్ కోర్సులను పెడుతున్నామని గొప్ప లు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో జనాభాకి సరి పడా ఉన్నత పాఠశాలలు ఉన్నా యా..? లేవా..? అనే అంశాన్ని పరి శీలించడం లేదు. జిల్లాలోని జిల్లాపరిషత్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో రోజురోజుకూ విద్యార్థుల తా కిడి పెరుగుతోంది.
ఏటా 10 నుం చి 20 శాతం ప్రైవేటు ప్రైమరీ నుం చి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు వస్తున్నట్లు కొన్నేళ్ల నివేదికలు చెపుతున్నాయి. ఈ నేపధ్యంలో మున్సిపాలిటీల్లోని ఉన్నత పాఠశాలలకూ విద్యార్థుల తాడికి ఉంది. ప్రభుత్వం పాఠశాలలను పెంచే దిశగా అడుగులు వేయడం లేదు.
నాటికీ... నేటికీ... అవే పాఠశాలలు
విజయనగరం మున్సిపాలిటీని పరిశీలిస్తే దశాబ్దాలుగా నూతన పాఠశాలలు ఏర్పడకపోవడం వల్ల ఇక్కడి పేదోడికి విద్య అందనంత దూరంలో ఉంది. స్వాతంత్య్రం రాక ముందు మున్సిపాలిటీగా ఉన్నప్పుడు ఎన్ని పాఠశాలలున్నాయో... ఇప్పటికీ అవే కొనసాగుతున్నాయి. ఇదే పరిస్థితి సాలూరు, పార్వతీపురం, బొబ్బిలి మున్సిపాలిటీల్లోనూ ఉంది. విజయనగరం పట్టణంలో 80 శాతం ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబ పిల్లల చదువుల కోసం మున్సిపల్ పాఠశాలల సంఖ్యను పెంచడానికి ఎవ్వరూ కృషి చేయలేదు. కనీసం ప్రతిపాదనలూ చేయలేదు. పట్టణ జనాభా 50 వేల నుంచి రెండు లక్షలకు చేరింది. వార్డుల సంఖ్య 15 నుంచి 40కి విస్తరించింది. కానీ ఇక్కడ 40 ఏళ్ల క్రితం ఉన్న మూడు మున్సిపల్ ఉన్నత పాఠశాలలే ఉన్నాయి. విజయనగర పూసపాటి వంశీయుల విద్యా ట్రస్ట్ పాఠశాలలతోపాటు ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్, ప్రైవేటు విద్యాసంస్థలు ప్రైవేటు పాఠశాలలు మాత్రం పుట్టగొడుగుల్లా ఏర్పడ్డాయి.
విస్తరిస్తున్న ప్రైవేటు పాఠశాలలు
తాజాలెక్కల ప్రకారం పట్టణంలో 200 వరకు ప్రైవేటు విద్యాసంస్థల ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 36 వరకు ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో చేరాలంటే ఆర్థిక భారం తప్పదు. మున్సిపల్ పాఠశాలల విషయానికి వస్తే మొత్తం 43 ఉన్నాయి. వీటిలో మూడే ఉన్నత పాఠశాలలు. ఒక్కోపాఠశాలలో వెయ్యిమందికి పైగా విద్యార్థులు ఉన్నారు. పట్టణం విస్తరిస్తున్న నేపధ్యంలో అందుకు అనుగుణంగా ఉన్నత పాఠశాలు లేకపోవడం వల్ల శివారు ప్రాంతాల పేద కుటుంబాల పిల్లలకు చదువులు అందడం లేదని విద్యావేత్తలు, ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. అందుబాటులో ప్రైవేటు విద్యాసంస్థలు ఉన్నా ఆర్థిక స్థోమత చాలక చదువులకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీ విస్తరణ, కుటుంబాల సంఖ్యకు అనుగుణంగా కనీసం మరో ఏడు ఉన్నత పాఠశాలల అవసరం ఉందని చెబుతున్నారు.
ఉన్నత పాఠశాలలు లేకే...
పట్టణంలో అన్ని మున్సిపల్ ఉన్నత పాఠశాలలకూ విద్యార్థుల డిమాండ్ ఉంది. పాఠశాలల సంఖ్య జనాభాకు అనుగుణంగా లేకపోవడం వల్ల మధ్యతరగతి కుటుంబాలు ప్రైవేటు విద్యాసంస్థలను ఆశ్రయిస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పు చేసి ప్రైవేటు స్కూళ్లలో చదివించాల్సి వస్తోంది. మున్సిపాలిటీ పాలకమండలి స్పందించి కొత్త స్కూళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి.
- ఆర్.ఎస్.ప్రసాద్, చైర్మన్, మున్సిపల్ ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక