ప్లీజ్...నవ్వకండి
తనకిచ్చిన యూనిఫాం
నిక్కరు 34 ప్యాంటులా ఉందని చూపిస్తున్న
ఒకటో తరగతి విద్యార్థి
ప్రభుత్వం సరఫరా చేసే యూనిఫాం కోసం ఎదురుచూసిన చిన్నారులకు భంగపాటు ఎదురైంది. జూన్‌లో పాఠశాలలు తెరిచినా ఇవి సరఫరా చేయడానికి చాలా కాలం పట్టింది. నిరీక్షణలో కాలహరణమయింది. వేసవి సెలవులు మరో రెండు నెలలున్నాయనగా ఎట్టకేలకు సరఫరా చేశారు. తీరా వచ్చిన ఆ యూనిఫాం చూసి చిన్నారులు విస్తుపోతున్నారు. ఎలా ధరించి స్కూలు రావాలో తెలియడం లేదు. యూనిఫాం చిన్నవి కావడమో, పెద్దవి కావడమో జరగడంతో అవస్థలు పడుతున్నారు.
శ్రీకాకుళం/వీరఘట్టం: జిల్లాలో 2,593 ప్రాధమిక,567 ప్రాధమికోన్నత,470 జిల్లా పరిషత్,ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 1 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఇటీవల యూనిఫామ్ పంపిణీ చేశారు. 6,7,8 తరగతి విద్యార్థులకు యూనిఫామ్‌ల కొలతలు సరిపోయినా ఒకటి నుండి 5వ తరగతి వరకూ విద్యార్థులకు చాలిచాలని యూనిఫామ్‌లను అందా యి. 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న వారు 1.21 లక్షల మంది ఉన్నారు. నిక్కరు, చొక్కాతో కూడినరెండు జతలు పంపిణీ చేశారు.
అందరికీ ఒకే కొలతలతో నిక్కరు, చొక్కాలు కుట్టడంతో 70 శాతం మంది విద్యార్థులకు చాలిచాలనవిగా మారాయి. 1వ తరగతి విద్యార్థులు ధరిస్తే లూజుగా ఉన్నాయి. 5వ తరగతి విద్యార్థులకు ఇరుకుగా పట్టేయడంతో చిన్నబుచ్చుకుంటున్నారు. నిబంధనల మేర కు కుట్టు కాంట్రాక్ట్ పొందిన వ్యక్తులు పాఠశాల స్థాయికి వెళ్లి కొలతలు తీసుకొని సంబంధిత ప్రధానోపాధ్యాయుని నుంచి వస్త్రా న్ని తీసుకోవాలి. గడిచిన కొన్నేళ్లుగా ఇవేవీ జరగడం లేదు. జిల్లాలో 1 నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు 2.40 లక్షల మంది వరకు ఉన్నారు.
వీరికి రెండు జతల చొప్పున ఇచ్చేందుకుగాను 4.80 లక్షల యూనిఫామ్‌లు అవసరమవుతాయి. ఒక్కో యూనిఫామ్ కుట్టేందుకు రూ. 40 చొప్పున చెల్లిస్తారు. ఈ లెక్కన మొత్తం యూనిఫామ్‌లు కుట్టేందుకు రూ. 1.92 కోట్లు అవుతుంది. ఇంత పెద్దమొత్తంతో కూడిన కాంట్రాక్ట్ కావడంతో రాజకీయ జోక్యం కూడా తోడై పైరవీలు చోటుచేసుకుంటున్నాయి. లక్షల రూపాయిలు చేతులు మారుతున్నాయి.
ఈనేపథ్యంలో నిబంధనలను తుంగలోకి తొక్కి జిల్లా కేంద్రంలోనే వస్త్రాన్ని అప్పగించి కాంట్రాక్ట్ పొందిన వారితో కుట్టుపని చేయిస్తున్నారు. ఈ ఏడాది కుట్టుపని విషయంలో వివాదం చోటుచేసుకొని కోర్టు కేసు వరకు వెళ్లిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. యూనిఫామ్‌ల సరఫరా అవినీతిమయం కావడంతో దీని ప్రభావం మీద పడి పేద విద్యార్థులు అనుభవిస్తున్నారు. యూనిఫామ్‌ల విషయంలో అధికారులు సైతం ఉన్నతాధికారుల ఆదేశాలను పట్టించుకోవడం లేదు. ఇందుకు ఉదాహరణగా కలెక్టర్ కాదన్న వస్త్రంతో కుట్టిన యూనిఫారాలను సరఫరా చేయడాన్ని చెప్పవచ్చు.