చేప పిల్లలను మింగారు!
వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే ఎక్కువ
అధికార పార్టీ ఎమ్మెల్సీ కీలక పాత్ర
అక్రమాలపై విజిలెన్స్ విభాగం దృష్టి
ప్రభుత్వ లక్ష్యానికి అక్రమార్కుల గండి
చేప పిల్లల పంపిణీలో భారీ కుంభకోణం
చేపలను లెక్కించడం కష్టమైన పని. చేప పిల్లలను లెక్కించడం ఇంకా కష్టం. ఈ కఠినమైన పనులను కొందరు అక్రమాలకు నెలవుగా మార్చుకున్నారు. లెక్కించడం సాధ్యంకాని చేప పిల్లల పంపిణీలో అక్రమాలకు పాల్పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ కుంభకోణంలో వరంగల్ ఉమ్మడి జిల్లా అగ్రభాగాన ఉందని తెలుస్తోంది. చెరువుల్లో చేప పిల్లలను వేసే ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాంట్రాక్టర్లతో కలిసి వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ శాసనమండలి సభ్యుడు(ఎమ్మెల్సీ) అక్రమాలు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై విజిలెన్స్ విభాగం వివరాలు సేకరించడం మొదలుపెట్టింది. గత ఏడాది సైతం ఉమ్మడి జిల్లాలో ఇవే అక్రమాలు జరిగాయి. అప్పుడు కూడా అధికార పార్టీ ఎమ్మెల్సీపైనే ఆరోపణలు రావడం గమనార్హం.
వరంగల్ :వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం చేపల పెంపకంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవగా మిషన్ కాకతీయ పనులతో చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయి. సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలతో జిల్లాలోని 90 శాతం చెరువులు అలుగు పోశాయి. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున చేపల పెంపకం కార్యక్రమాన్ని చేపట్టింది. అన్ని చెరువుల్లో చేపల పెంపకం చేపట్టాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా మత్స్య శాఖ చేపల పిల్లల సేకరణ కోసం టెండర్లు పిలిచింది. ఉమ్మడి జిల్లాల వారీగా టెండర్లు పిలిచారు. ఒక్కో చేప పిల్లకు రూ.70 పైసల నుంచి రూ.90 పైసల చొప్పున ధర నిర్ణయించారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 4.15 కోట్ల చేపల పిల్లలను పంపిణీ చేసినట్లు మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. మొత్తం 910 చెరువుల్లో చేప పిల్లలను వేసినట్లు పేర్కొన్నారు. అక్టోబరు 1 నుంచి డిసెంబరు మొదటి వారం వరకు చేప పిల్లలను చెరువులో వదిలారు. ఈ చేప పిల్లల పంపిణీ టెండర్లను ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు.
చేప పిల్లల పంపిణీలో లెక్కల్లో చూపిన దానికి, పంపిణీ చేసిన దానికి భారీగా తేడా ఉన్నట్లు తెలిసింది. చేప పిల్లలను ఆక్సీజన్ సిలిండర్ అమర్చిన వ్యాన్‌లలో తీసుకువచ్చారు. ఒక్కో వ్యాన్‌లో పది డ్రమ్ములు ఉంటాయి. ఒక్కో డ్రమ్ములో పది వేల చొప్పున చేప పిల్లలు ఉంటాయి. 4.15 కోట్ల చేప పిల్లలను పోసినట్లు లెక్కలు చెబుతున్నారంటే... వరంగల్ ఉమ్మడి జిల్లాకు 4,150 వాహనాలు రావాల్సి ఉంది. వాస్తవ పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నట్టు తెలుస్తోంది. గణాంకాల్లో పేర్కొన్న వాహనాల్లో సగం కూడా జిల్లాకు రాలేదని తెలుస్తోంది. వాహనాల రాకపోకలను నమోదు చేసే చెక్‌పోస్టులలో పేర్కొన్న లెక్కలతోనే చేప పిల్లల పంపిణీలో అక్రమాలు బయటపడుతున్నాయి. కొన్ని చెరువుల్లో పోసిన చేప పిల్లల లెక్కల విషయంలో స్థానికులు, ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులు, చెక్‌పోస్టుల్లో నమోదైన లెక్కల ఆధారంగా చేప పిల్లల పంపిణీలో అక్రమాలను బయటికి తీసేందుకు విజిలెన్స్ విభాగం సన్నద్ధమవుతోంది. ఉమ్మడి జిల్లాలో అనధికారికంగా చేపపిల్లల పంపిణీ బాధ్యత తీసుకున్న ఓ ఎమ్మెల్సీ సదరు కాంట్రాక్టర్లతో కలిసి అక్రమాలకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. పూర్తి స్థాయి విచారణ తర్వాత చేప పిల్లల్లో అక్రమాలు, అక్రమార్కుల వివరాలు బయటకి రానున్నాయి.