సిద్దిపేటలో ఫాగింగ్ చర్యలు
- నివారణ చర్యలు శూన్యం.. రూ.15 లక్షలు విదిలింపు
- సరిపోని నిధులు.. కరువైన ఫాగింగ్
- రక్షణకు జనం ఖర్చు రూ.కోటిపైనే
- మురికివాడల్లో రోగాల విజృంభణ
సిద్దిపేట జోన్: జిల్లావాసులకు, బల్దియాలకు ఏటా దోమపోటు తప్పడం లేదు. ఐదు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో పారిశుద్ధ్య లోపం, నివారణ చర్యలు అంతంతమాత్రంగా ఉండటంతో వర్షాకాలం, శీతాకాలంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఈక్రమంలో ప్రత్యేకంగా దోమల నివారణకు ఆయా మున్సిపాలిటీలకు రూ.15 లక్షల పద్దు కేటాయిస్తుండగా.. ఈ నిధులు ఏమూలకూ సరిపోవడం లేదు. ఇక ప్రజలు దోమల బెడద నుంచి తప్పించుకునేందుకు జిల్లా వ్యాప్తంగా ఆయా సీజన్లలో రూ.కోటి వరకు ఖర్చు చేస్తున్నారని అంచనా.
జిల్లాలోని సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, సదాశివపేట, జహీరాబాద్ మున్సిపాలిటీలతో పాటు గజ్వేల్, దుబ్బాక, జోగిపేట నగర పంచాయతీలు ఉన్నాయి. మున్సిపల్ రికార్డుల ప్రకారం ఆయాచోట్ల ప్రతి లక్ష జనాభాకు 25 వేల మంది మురికివాడల్లో నివసిస్తున్నారు. మున్సిపాలిటీల్లో అవసరం మేర పారిశుద్ధ్య సిబ్బంది లేకపోవడం, నివారణ చర్యలు సక్రమంగా జరగకపోవడంతో ఏటా వర్షాకాలం, శీతాకాలంలో మురికివాడలకు దోమకాటు తప్పడం లేదు.
దీంతో వైరల్ ఫీవర్ బారిన పడి జేబులు గుల్ల చేసుకోకుండా ప్రజలు ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నారు. అందులో భాగంగా ప్రతి కుటుంబం సగటున రూ.150 ఖర్చుపెట్టి మస్కిటో కాయిల్స్, లిక్విడ్, ఎలక్ట్రిల్ బ్యాట్, దోమ తెరలు కొనుగోలు చేస్తున్నారు. ఈ లెక్కన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని మురికివాడల్లో నివసించే సుమారు 25 వేల కుటుంబాలు అనాధికారిక లెక్కల ప్రకారం ప్రతినెలా రూ.కోటి మించి ఖర్చు చేస్తున్నారు.
ఒక్కో మున్సిపల్‌కు రూ.2 లక్షల ఖర్చు
ఫాగింగ్ మిషన్, హ్యండ్‌పంప్ స్ర్పే, కెమికల్స్ కొనుగోళ్లతో పాటు వాహనాల కోసం పెట్రోల్, డీజిల్ రూపంలో ఒక్కో మున్సిపాలిటీకి ఏటా సగటున రూ.2 లక్షల చొప్పున ప్రత్యేక పద్దు కేటాయిస్తున్నారు. ఇదిలా ఉండగా, మురికివాడల్లో ప్రజలు దోమకాటు నుంచి తప్పించుకునేందుకు ఒక్కో కుటుంబం సగటున రూ.150 వెచ్చిస్తోంది.
అధికార పద్దు రూ.15 లక్షలు
జిల్లాలోని మున్సిపాలిటీల్లో దోమల నివారణ చర్యల కోసం అధికారిక పద్దు నిర్వహించడం విశేషం. శానిటేషన్ విభాగం ప్రత్యేకంగా ఫాగింగ్ చర్యలు, మురికి కాల్వల్లో స్ర్పే చేపడుతుంది. అందుకు అసరమయ్యే ఫాగింగ్ మిషన్, కెమికల్స్, వాహనానికి డీజిల్, పెట్రోల్ ఖర్చు, హ్యాండ్ పంప్ స్ప్రే కోసం ఏటా రూ.2 లక్షల చొప్పున ఖర్చు చేస్తున్నారు. ఈ లెక్కన సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, జహీరాబాద్, సదాశివపేట, గజ్వేల్, దుబ్బాక, జోగిపేటల్లో రూ.15 లక్షల ప్రత్యేక పద్దు కేటాయిస్తున్నారు.
సిద్దిపేట కొంత బెటర్
జిల్లాలోని మున్సిపాలిటీల పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే సిద్దిపేటలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉందనే చెప్పాలి. పట్టణంలోని 34 వార్డుల్లో 15 వార్డులు మురికివాడలుగా గుర్తింపు పొందినా.. ఏడాదిగా స్వచ్ఛ సిద్దిపేట దిశగా అడుగులు వేస్తోంది. ఇంటింటికీ చెత్త సేకరణ ద్వారా పారిశుద్ధ్యం మెరుగుపడింది. మున్సిపల్ అధికారులు ఏటా రూ.2 లక్షలు కేటాయించి ఫాగింగ్ చేపడుతున్నారు.