29సికెయమ్25:
-
ప్రభుత్వ వాహనంతో బైక్‌ను ఢీకొట్టిన అటవీశాఖ డ్రైవర్
-
మద్యం మత్తులో క్షతగాత్రులతో వాగ్వాదం
-
పోలీసులకు అప్పగించిన స్థానికులు
ఖమ్మం క్రైం: విధి నిర్వహణలో ఉన్న అటవీశాఖ జీపు డ్రైవర్ గురువారం మధ్యాహ్నం మద్యం మత్తులో ఖమ్మంలో వాహనాన్ని ఇష్టారీతిన నడుపుతూ బైక్‌ను ఢీకొట్టడంతో తండ్రీ కూతుళ్లకు గాయాలయ్యాయి. అంతకుముందే ఓ బాలిక సైకిల్‌పై వెళ్తుండగా ఢీకొనడంతో..అదృష్టవశాత్తూ ఆమె సురక్షితంగా బయటపడింది. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..అటవీశాఖ రేంజర్ వాహనాన్ని నడిపే డ్రైవర్ శంకర్ మద్యం సేవించి ఇష్టారీతిగా వాహనం నడుపుతూ వస్తూ త్రీటౌన్ పరిధిలోని జమలాపురం కేశవరావు పార్క్ వద్ద వెనుక నుంచి ఓ ద్విచక్రవాహనం ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వాహనంపై ఉన్న ఖమ్మం రూరల్ మండలం బారుగూడేనికి చెందిన కూలి సెల్వరాజు, అతని మూడెళ్ల కూతురు జపన్యకు గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రుడు సెల్వరాజు జీపును అడ్డుకోవడంతో..మద్యం మత్తులో తూలుతూ వాహనం దిగిన డ్రైవర్ శంకర్..తాను ఫారెస్ట్ ఉద్యోగినని, ఏం చేస్తావంటూ బెదిరించసాగాడు. ఈ ప్రమాద ఘటనను ప్రత్యక్షంగా చూసిన స్థానికులు అక్కడికి చేరుకొని..గాయాలపాలైన చిన్నారిని చూసి చలించారు. మద్యం మత్తులో బైక్‌ను ఢీకొంది కాక..బెదిరిస్తుండడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పారిబోయిన అతడిని పట్టుకొని త్రీటౌన్, ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను అటవీశాఖ జీపులోనే జిల్లా ఆస్పత్రికి తరలించగా వారు చికిత్స పొందుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గొడవ జరుగుతున్నప్పుడు ఎస్పీ షానవాజ్‌ఖాసీం జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి క్యాంప్ ఆఫీస్‌కు వెళుతున్నారు. కేశవరావు పార్క్ వద్ద గొడవ జరుగుతుండడాన్ని తన వాహనంలో గమనించిన ఆయన..త్రీటౌన్ సీఐ మొగిలి, ట్రాఫిక్ సీఐ నరేష్‌రెడ్డికి ఫోన్ చేసి..పరిశీలించినట్లుగా సమాచారం. సాక్షాత్తూ ఎస్పీనే సూచించడంతో ఈ ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకొని విచారిస్తున్నారు.